Jun 20,2023 00:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ కార్పొరేషన్‌ 'ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ మళ్లీ క్షేమంగా ఇంటికి చేరాలి. తనకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా చెప్పుకోవాలి. తన హక్కుల కోసం గొంతెత్తాలి. అలాంటి సమాజ నిర్మాణ కోసమే జనసేన పార్టీ పోరాటం చేస్తోంది' అని పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. వారాహి యాత్రలో భాగంగా సోమవారం కాకినాడలో పార్టీ మహిళా విభాగం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేదని, విశాఖపట్నంలో సాక్షాత్తు ఒక ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయిందన్నారు. డబ్బుల కోసం కిడ్నాప్‌ చేశారన్నారు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
మత్స్యకారుల సమస్యలపై పవన్‌ ఆరా
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జగన్నాథపురం నుంచి బోటులో ఏటిమొగకు వెళ్లారు. అక్కడ మత్స్యకారులతో భేటీ అయ్యారు. మత్స్యకారుల స్థితిగతులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్‌ కంపెనీల కార్యకలాపాల వల్ల మత్స్య సంపద దొరకడం లేదని పలువురు మత్య్సకారులు పవన్‌ దృష్టికి తీసుకువచ్చారు. చేపల వేట విరామం సమయంలో ప్రభుత్వం ఇస్తున్న వేట నిషేధ పరిహారం సరిపోవడం లేదని, అనేకమందికి అండడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ప్రతి మత్స్యకారుడు ఆర్థికాభివద్ధి సాధించి ఆనందంగా ఉండాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌, పిఎంసి సభ్యుడు ముత్తా శశిధర్‌, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్‌ బొమ్మిడి నాయకర్‌ పాల్గొన్నారు.