Oct 07,2023 00:04

వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలోని కొందరు విలేకరుల స్థలాల విషయంలో సురభి వెంకటేశ్వర్లు అడ్డువస్తున్నాడని, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,అధికారులు బాధితుల పోరాట సంఘం నాయకులు కె.హనుమంత్‌ రెడ్డి, మేడం రమేష్‌, మహం కాళి సుబ్బారావులు అన్నారు. వినుకొండ సబ్‌ జైల్లో రిమాండ్‌ లో ఉన్న సర్వే వెంకటేశ్వర్లును పరామర్శించేందుకు వెళ్లిన నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని గద్దల బోడు సర్వేనెంబర్‌ 229-3-6 లో 1-47 ఎకరాల భూమిని సురభి వెంకటేశ్వర్లు గతంలో కొనుగోలు చేశారని, అదే భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నియోజకవర్గంలోని కొందరు విలేకరులకు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాల నిమిత్తం ఇచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. తన భూమి కోసం.. కొనుగోలు చేసిన సురభి వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారని అన్నారు. జనవరి 13వ తేదీన పుల్లల చెరువు మండలం రెంటపాళ్ల తండాకి చెందిన బాణావత్‌ మోహన్‌ నాయక్‌ చేత బ్రహ్మ నాయుడు ఫిర్యాదు ఇప్పించగా వినుకొండ పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సురభి వెంకటేశ్వర్లు పై అక్రమంగా బనాయించిన ఎస్సీ,ఎస్టీ కేసు, అరెస్టును రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని కోరారు. నిబంధనల ప్రకారం వినుకొండ నియోజకవర్గ విలేకరులకు ఇళ్ల స్థలాలు ఆయా మండల కేంద్రాల్లో ఇవ్వాలని, నియోజకవర్గంలో ఐదు మండలాల విలేకరులకు వినుకొండలో ఇవ్వడం సబబు కాదని అన్నారు.