ప్రజాశక్తి - తుళ్లూరు:రాజధాని ప్రాంత పారిశుధ్య కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.సిఆర్‌డిఎ సూపర్ వైజర్‌ల వేధింపులకు వ్యతిరేకంగా సోమవారం తుళ్లూరులో పని విరామ సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. నెక్కల్లులో పనులు మానివేసి నిరసన తెలిపారు.కార్మికుల నిరసనల నేపథ్యంలో రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి తుళ్లూరులో ఒక ప్రకటనలో మాట్లాడుతూ సోమవారం నెక్కల్లులో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై సూపర్ వైజర్ మన్మధరావు వేధింపులకు పాల్పడటంతో పని మానేసి కార్మికులు ఇళ్లకు వెళ్లిపోయారని రవి తెలిపారు.ఇద్దరు మహిళా కార్మికులు తుళ్లూరులోని చెత్తడంప్‌కు వెళ్లి పని చేస్తామని చెప్పగా ఒక మహిళా కార్మికురాలే వెళ్ళాలని,తను చెప్పిందే చేయాలని సూపర్ వైజర్ మన్మధరావు పంతం పట్టాడని చెప్పారు. తన ఆదేశాలను అమలు చేయకపోతే పనిలో లేనట్టుగా పరిగణిస్తామని బెదిరింపులకు దిగాడని,ఇది మంచి పద్ధతి కాదన్నారు.గత బుధవారం పనిచేయటానికి తుళ్లూరు వెళ్లిన అనంతవరం గ్రామానికి చెందిన కార్మికుడు శేషయ్యను విధుల్లోకి వెళ్లనీకుండా అడ్డుకొని అకారణంగా శేషయ్యను పనికిరావద్దంటూ సూపర్ వైజర్ హుకుం జారీ చేశాడని చెప్పారు.ఈ వేధింపులకు నిరసనగా గత శనివారం నుంచి పని విరామ సమయంలో పారిశుధ్య కార్మికులు నిరసన తెలుపుతున్నారని చెప్పారు. కో-ఆర్డినేటర్ నరసింహారావు, కొందరు సూపర్ వైజర్‌ల వేధింపులు తట్టుకోలేక పోతున్నామంటూ పారిశుధ్య కార్మికులు వాపోతున్నారని రవి చెప్పారు. కార్మికులపై వేధింపులు ఆపాలని కోరుతూ విజయవాడ సిఆర్‌డిఎ అధికారులకు కార్మిక సంఘం నాయకులు అర్జీ అందజేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. .మన్మధరావు తను బాధ్యత వహిస్తున్న రెండు గ్రామాల్లో కార్మికులకు ఇచ్చే ఈఎస్‌ఐ ఫారాలు తప్పులతడకలుగా పంపించాడని,గుంటూరు జిల్లాకి బదులు అనంతపురం జిల్లా అని, మహిళా కార్మికులను మగవాళ్ళుగా,పెళ్లయిన వారిని పెళ్లి కాని వారిగా చూపిస్తూ ఇచ్చిన ఈఎస్‌ఐ కార్డులు పని చేయక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.సూపర్ వైజర్ ఈఎస్‌ఐ ఫారాలలో కార్మికుల వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల కార్మికులు గుణదల ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు వెళ్లి వెనుతిరిగి వస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కార్మికులపై తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్న మన్మధరావుపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రవి కోరారు.లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని రవి హెచ్చరించారు.










