సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నేరపూరితమైనన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ధారించడం సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చింది. విమర్శలను తట్టుకోలేని అసహనాన్ని ప్రదర్శిస్తూ, అసమ్మతిని శిక్షించడానికి కోర్టు ధిక్కార చట్టాన్ని ఉపయోగించింది. కోర్టుపై అపవాదు వేసినట్లుగా కనపడుతున్న ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లకు అటువంటి నిర్ధారణకు రావాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో కోర్టు కార్యకలాపాలు, పనితీరుకు సంబంధించిన కోణాల్లో...అలాగే వివిధ తీర్పులపై...సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. కోర్టును అప్రతిష్టపాలు చేశారంటూ వారినందరినీ దోషులుగా పరిగణిస్తారా? వారిపై ఎలాంటి చర్య తీసుకోనపుడు ఇప్పుడీ ద్వంద్వ ప్రమాణాలెందుకు?
ప్రశాంత్ భూషణ్ తప్పు చేశారని నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో క్షమాపణ చెబితే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేద్దామని కోర్టు భూషణ్‌ను కోరింది. కానీ, ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పేందుకు వ్యతిరేకించారు. తాను చేసింది ఎలాంటి అరమరికలు లేని స్వచ్ఛమైన విమర్శగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
కోర్టుధిక్కార కేసులో భూషణ్‌ను దోషిగా నిర్ధారించడాన్ని ఏదో ఒక సంఘటనగా చూడలేం. ఇటీవలి సంవత్సరాల్లో సుప్రీంకోర్టు పనితీరు, న్యాయాన్ని వెలువరించే క్రమంలో కలతపెట్టే ధోరణులు అనేకం తలెత్తుతున్నాయి. అందులో ఇదొకటిగా భావించవచ్చు. పైగా, అత్యున్నత న్యాయస్థానం ఎగ్జిక్యూటివ్ కోర్టుగా మారినట్లు కనిపిస్తోంది. రాజ్యాంగ హక్కులు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల ఏ మాత్రమూ ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ వాటికి ఆమోద ముద్ర వేస్తుండడం, అలాగే రాజ్యాంగపరమైన అంశాల ఎగవేత, ప్రభుత్వ నిర్ణయాలను అతిశయంగా చూపడం, కోర్టు నిర్ణయాల సమీక్షలో జ్యుడీషియల్ నిబంధనల ఉల్లంఘన, జవాబుదారీతనం కొరవడడం వంటి కారణాల వల్ల కోర్టు పని తీరు విమర్శలకు గురవుతోంది.
గత ఏడాది కాలంగా, ఈ ధోరణులు మరింతగా ప్రస్ఫుటం అవుతున్నాయి. అన్నింటికన్నా స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే, జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన అంశాలు అటు రాజ్యాంగపరమైన, ఇటు ప్రాథమిక హక్కులకు సంబంధించిన వాటిని పరిష్కరించిన తీరు ఈ ధోరణిని మరింత స్పష్టంగా ఎత్తిచూపుతోంది. 370వ అధికరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చెల్లుబాటును, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు ఇంతవరకు విచారించలేదు. గత ఏడాది కాలంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 4జి నెట్‌వర్క్ కనెక్షన్ ఇవ్వకపోవడానికి సంబంధించి ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కోర్టు ఘోరంగా విఫలమైంది. పైగా నిషేధాన్ని విధించిన ప్రభుత్వ కమిటీని దీనిపై సమీక్షించా ల్సిందిగా కోరడమేగాక...అంతటితో ఆ విషయానికి స్వస్తి చెప్పింది. అక్రమ నిర్బంధాలకు గురైన ప్రజల హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో పౌరుల స్వేచ్ఛా హక్కు కోల్పోయినందుకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో కోర్టు తన బాధ్యతను విడనాడింది. ఇటీవల అత్యంత అధ్వాన్నమైన సంఘటన ఒకటి జరిగింది. కాంగ్రెస్ నేత సైఫుద్దీన్ సోజ్ నిర్బం ధంలో లేరని ప్రభుత్వం స్వయంగా కోర్టులో ప్రకటించింది. అదే రోజు సాయంత్రం ఆయనను ఇంటి నుండి బయటకు రాకుండా అడ్డగిస్తున్న మీడియా విజువల్స్ వెలువడ్డాయి. అయినప్పటికీ, సదరు అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ వారిపై కోర్టు అభియోగాలు మోపలేదు.
ఇకపోతే వలస కార్మికుల దుస్థితికి సంబంధించిన కేసుల్లో, సుప్రీంకోర్టు మొదట జోక్యం చేసుకోవడానికి తిరస్కరించింది. దానికి విరుద్ధంగా కోర్టు, మానవ హక్కుల మధ్య దూరం వుందనేలా వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి, ఈ కేసుల్లో, ఇంకా అనేక అంశాల్లో హైకోర్టులు మరింత సానుభూతితో, ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి.
దేశ ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాన్ని కనపరిచే ఎలక్టోరల్ బాండ్లను సవాలు చేస్తూ పిటిషనన్లు దాఖలై ఇప్పటికి రెండున్నరేళ్ళు గడిచాయి. అయినా, ఇంకా కోర్టు ఈ కేసు విచారణకు సమయం దొరకడం లేదు. ప్రభుత్వానికి సాయం చేయడం కోసం న్యాయ నిబంధనలను తుంగలోకి తొక్కిన మరో ఉదాహరణను ప్రస్తావిద్దాం. కరోనా సంక్షోభ సమయంలో, ప్రాధాన్యతా కేసులను మాత్రమే విచారణకు స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. అయితే, 370వ అధికరణ రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం, ఎలక్టోరల్ బాండ్ల విషయం వంటివి కోర్టు ప్రాధాన్యతా కేసులుగా పరిగణించలేదు.
అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని బెంచ్ అయోధ్య వివాదంపై తీర్పు ఇవ్వడానికి 40కి పైగా సెషన్లలో రోజువారీ విచారణలను జరిపింది. బాబ్రీ మసీదు వున్నచోట రామ మందిరం నిర్మిస్తామని పాలక పార్టీ ఇచ్చిన హామీలకు అనుగుణంగా తీర్పు వెలువడింది. కానీ, ఇందుకు విరుద్ధంగా, శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు వచ్చేసరికి, రివ్యూ పిటిషన్లను విచారించే బెంచ్ వింత వైఖరి తీసుకుంది. సమీక్ష జరపడానికి బదులుగా, కొన్ని చట్ట సంబంధమైన అంశాలు - రివ్యూ పిటిషన్లను విచారించే బెంచ్ పరిధికి వెలుపల గల అంశాలను- పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తదనుగుణంగా, ఈ అంశాల పరిశీలనకు 9 మంది సభ్యులతో బెంచ్‌ను ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. దేశ రాజ్యాంగం, చట్టాల కన్నా విశ్వాసాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న పాలక పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ విన్యాసాలు జరిగాయి.
సుప్రీంకోర్టు పనితీరులో కనిపిస్తున్న ఈ అనారోగ్య ధోరణులకు ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం దగ్గరే వుంది. సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల నియామకంలో మోడీ సర్కార్ దారుణంగా జోక్యం చేసుకుంది. కొలీజియం సిఫార్సు చేసిన గోపాల్ సుబ్రమణియం నియామకాన్ని స్తంభింపచేయడం దగ్గర నుండి హైకోర్టు న్యాయమూర్తుల ప్రమోషన్లు, బదిలీలను కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. రిటైరైన ప్రధాన న్యాయమూర్తులకు కొన్ని తాయిలాలు ఇవ్వడం మొదలెట్టింది. జస్టిస్ సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించడం, జస్టిస్ గొగోరును రాజ్యసభ సభ్యునిగా పంపడం వంటివి అందులో కొన్ని. ప్రభుత్వ అవసరాలకు తగినట్లుగా లొంగిపోయే న్యాయ వ్యవస్థ వుండడం చాలా ప్రమాదకరమైన పరిణామం. చట్టాలను, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినపుడు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్ర రాజీ పడిపోతోంది. న్యాయ వ్యవస్థ సమగ్రత, స్వేచ్ఛ పూర్తిగా కోతకు గురవుతుండడమనేది మోడీ నిరంకుశ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రభావమని చెప్పక తప్పదు.
రిటైరైన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, బార్ సభ్యులు ఇలా న్యాయ వ్యవస్థకు చెందిన వారంతా సమున్నత న్యాయస్థానంలో చోటు చేసుకుంటున్న ఈ ధోరణులను ప్రశ్నించడమనేది రోజురోజుకూ పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ధిక్కార కేసులో దోషిగా నిర్ధారించినందుకు విస్తృతంగా జరుగుతున్న నిరసనలు, ఆయనకు పెరుగుతున్న మద్దతు చూస్తుంటే ప్రభుత్వానికి ప్రతికూల స్పందన ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
* ఆగస్టు 24-30 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం










