Apr 22,2022 05:57

దేశ రాజధాని ఢిల్లీ లోని జహంగీర్‌పురిలో యథాతథ స్థితిని కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించిన తరువాత కూడా పేదల ఇళ్లు, మసీదు గోడల కూల్చివేత కొనసాగించడం ద్వారా కాషాయ దళానికి న్యాయ వ్యవస్థపట్ల ఈషణ్మాత్రమూ గౌరవం లేదని తేటతెల్లమవుతోంది. తమ మతోన్మాద ఎజెండాను అమలు చేయనీయకుండా రాజ్యాంగ వ్యవస్థలు సైతం తమను అడ్డుకోలేవని చెప్పడానికే బిజెపి అధిష్టానం ఈ బరితెగింపునకు పాల్పడినట్టుంది. అయితే ప్రతిఘటించి వారి బుల్డోజింగ్‌ను అడ్డుకోవడం అభినందనీయం.
జహంగిర్‌పురి కూల్చివేతలపై సుప్రీం స్టే ఉత్తర్వులున్నా కూల్చివేత కొనసాగుతోందని బుధవారంనాడు న్యాయవాదులు వివరించాక సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తపర్చడం, రిజిష్ట్రీని పిలిచి కోర్టు ఆదేశాలను ఎన్‌డిఎంసి మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు వెంటనే తెలియజేయాలని ఆదేశించవలసి వచ్చిందంటే బిజెపి పాలనలో న్యాయవ్యవస్థ ఎంతగా అగచాట్లపాలవుతుందో స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల మేరకు కూల్చివేతలు ఆపేయాలని బాధితులు మొర పెట్టుకున్నా అధికారులు అనేక ఇళ్లు, దుకాణాలతోపాటు ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేశారు. బాధితుల హాహాకారాలు మిన్నుముట్టినా కాషాయ ఉత్తర్వులతో అధికారులు, పోలీసులు అమానుషంగా వ్యవహరించడం దారుణం. సుమారు 12 గంటల ప్రాంతంలో సిపిఎం నేత, పార్లమెంటు మాజీ సభ్యురాలు బృందా కరత్‌ కోర్టు ఆదేశాలకు సంబంధించిన పత్రాలతో అక్కడికి చేరుకుని, ఆదేశాలు చూపిన తరువాత కూడా కూల్చివేతను ఆపకపోవడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆమె ప్రాణాలకు తెగించి బుల్డోజర్‌ కు అడ్డు నిలిచిన తరువాత కాని కూల్చివేతలు ఆగలేదు. బిజెపి వ్యతిరేక జాతీయ పార్టీగా జబ్బలు చరుచుకునే కాంగ్రెస్‌ తో సహా పెద్ద పార్టీల నాయకులు ట్వీట్లు, ప్రకటనలకే పరిమితం కాగా, చిన్న శక్తిగా వున్నా ప్రజల పార్టీగా సిపిఎం తన బాధ్యతను నిర్వర్తించడం శ్లాఘనీయం.
శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా విద్వేష మూకలు దాడి చేసిన జహంగీర్‌పురి ప్రాంతంలో ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఆక్రమణల తొలగింపు పేరిట ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. అల్లర్లు జరిగిన ప్రదేశాల్లోని నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్‌ మేయర్‌ కు లేఖ రాయడం, వెనువెంటనే కార్పొరేషన్‌ అధికార్లు పోలీసు సహాయం అడగడం చకచకా సాగాయి. కూల్చివేత డ్రైవ్‌ కు 400 మంది పోలీసులు కావాలని కార్పొరేషన్‌ కోరగా పోలీస్‌ కమిషనర్‌ ఏకంగా 1500 మందిని పంపడంలోనే మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేసి వారి దుకాణాలను, ఆవాసాలను కూల్చివేయాలన్న దుర్బుద్ధి అవగతమవుతోంది. సరిహద్దులో యుద్ధానికి వెళ్లిన చందంగా తొమ్మిది బుల్డోజర్లతో 14 బృందాలుగా ఏర్పడి ఈ దుష్కృత్యానికి పాల్పడ్డారు. న్యాయం కోరుతూ బాధితులు సుప్రీం కోర్టు గడప తొక్కారన్న సమాచారం తెలిసే సాధారణంగా కూల్చివేత డ్రైవ్‌ మధ్యాహ్నం పూట చేపట్టే అధికారులు బుధవారంనాడు ఉదయం తొమ్మిది గంటలకే అందుకు పూనుకోవడం గమనార్హం.
'కూల్చివేతలు పూర్తిగా చట్టవిరుద్ధమని, బిజెపి బుల్డోజింగ్‌, బెదిరింపులు ఒక కమ్యూనిటీ మీదే కాదు, ఈ దేశ చట్టాన్ని, సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం అది బుల్డోజ్‌ చేస్తోంద'న్న బృందా కరత్‌ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఇవే పద్ధతులను ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అనుసరించారు. నరేంద్ర మోడీ సర్కారు రెండవ దఫా అధికారానికి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థలను కాలరాసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలైన ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, సార్వభౌమత్వం, సామాజిక న్యాయం వంటి వాటికి తూట్లు పొడుస్తోంది. జహంగీర్‌పురి కూల్చివేతలు కేవలం ఆ ప్రాంతానికి చెందినవారికి మాత్రమేగాక యావత్‌ దేశంలోని మైనార్టీలు, ఇతర పేదల ప్రయోజనాలకు వ్యతిరేకం. కాబట్టి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ సాగిస్తున్న అకృత్యాలను విశాల ఉద్యమాలతో సమైక్యంగా అడ్డుకోవడం ద్వారా వారి కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలనను అంతం చేయాలి. అదే నేడు ప్రజల ముందున్న కర్తవ్యం.