Feb 18,2023 20:55

వాహనాలకు అనుమతి ఇవ్వాలని బైఠాయించిన శివస్వాములు
నిరసనతో నిలిచిపోయిన ఆర్‌టిసి బస్సులు
నిరసనతో నిలిచిపోయిన ఆర్‌టిసి బస్సులు

సున్నిపెంటలో వాహనదారుల ఆందోళన
- పార్కింగ్‌పై అస్పష్టత
- ప్రయివేటు వాహనాలు నిలిపివేత
- దాదాపు రెండు గంటల పాటు నిలిచిన రాకపోకలు
- అదుపు తప్పిన పరిస్థితి
- ఉన్నతాధికారుల ఆదేశాలతో అనుమతి

ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు

      శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి వస్తున్న భక్తుల వాహనాలు అనుకున్న స్థాయికి మించి అధిక సంఖ్యలో రావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దారులు నిండిపోయాయి. దీంతో సున్నిపెంటలోని శ్రీశైలం-హైదరాబాదు ప్రధాన రహదారి పార్కింగ్‌ స్థలం వద్ద ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సున్నిపెంట ప్రాజెక్టు హైస్కూల్‌ ఆట స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఆర్‌టిసి బస్సుల ద్వారా ప్రయాణం చేయాలని పోలీసు యంత్రాగం చెప్పారు. దీంతో ప్రైవేటు వాహన దారులు కొంత ఆగ్రహానికి గురై పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. గతంలో ప్రభుత్వం పార్కింగ్‌ ప్రదేశం నుండి శ్రీశైలానికి ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ ఊసే లేదని భక్తులు నిలదీశారు. మహా శివరాత్రికి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న శివ స్వాములు ఇరుముడిని ఎత్తుకొని బస్సులలో సాధ్యం కాదని, సొంత వాహనాలకు అనుమతించాలని ఆర్‌టిసి బస్సుల ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని గమనించిన స్థానిక ఎస్సై గంగయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు భక్తులకు ఎంత నచ్చచెప్పినా వినకుండా ప్రభుత్వానికి, పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన శివ స్వాములు సొంత వాహనాలలో వృద్ధులు, పిల్లలు ఉండడం వలన ఇక్కడ వాహనాలను వదిలివేస్తే తాగునీటికి, కాలకృత్యాలకు ఎలా తీర్చుకోవాలని పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. శివ స్వాములు, వృద్ధులు, వికలాంగులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొంతమంది భక్తులు వారి వారి సత్రాలలో రూములు బుక్‌ చేసుకున్నామని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని ఎస్‌ఐ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం వారు రావద్దని వారం రోజులు ముందు ప్రకటన చేస్తే శ్రీశైలానికి రాకుండా మరో శివ క్షేత్రానికి వెళ్లే వారమని పోలీసులను నిలదీశారు. స్థానిక పోలీసులు పరిస్థితి చేయి దాటిపోతుందని ఉన్నతాధికారులకు ఫోన్‌లో వివరించడంతో ఎట్టకేలకు వాహనాలను అనుమతించారు. దీంతో వాహనాలు రాకపోకలు సజావుగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.