
ప్రజాశక్తి - భీమవరం
వైఎస్‌ఆర్ సున్నా వడ్డీతో నిరుపేద మహిళలు వ్యాపారాలు మరింత అభివృద్ధి చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగు పర్చుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బహిరంగ సభలో వైస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు ప్రశాంతి, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ ద్వారా మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళలకు ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ఆచంట నియోజకవర్గంలో 4317 మంది మహిళలకు రూ.6.05 కోట్లు, భీమవరంలో 4873 మంది మహిళలకు రూ.6.99 కోట్లు, నరసాపురంలో 4491 మందికి రూ.6.90 కోట్లు, పాలకొల్లులో 5801 మందికి రూ.7.78 కోట్లు, తాడేపల్లిగూడెంలో 4844 మందికి రూ.7.34 కోట్లు, తణుకులో 5739 మందికి రూ.8.53 కోట్లు, ఉండిలో 5881 మందికి రూ.8.36 కోట్లు, ఉంగుటూరులో 1241 మందికి రూ.1.76 కోట్లు ఇలా జిల్లా మొత్తంగా 37,187 మందికి రూ.53.71 కోట్లు జమచేసినట్లు కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టరు ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, డిపిఎంఎలు కె.శ్రీనివాస్, డి.వెంకటేశ్వరరావు, సిఎంఎం సిహెచ్ నానిబాబు పాల్గొన్నారు.