ప్రజాశక్తి-విశాఖపట్నం : నగర సుందరీ కరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. షీలానగర్ ఎయిర్‌పోర్టు, ఎన్‌ఎడి జంక్షన్, మర్రిపాలెం, మురళీనగర్, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై-ఓవర్ తదితర ప్రాంతాలలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జి-20 సదస్సుకు దేశవిదేశీ ప్రతినిధులు వస్తున్నందున వారికి ఆహ్లాదం కల్గించేందుకు నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రధాన మార్గంలోని బ్యారికేడ్ల వద్ద వినియోగంలో లేని కేబుల్ వైర్లు తొలగించాలని, అవసరమైన వైర్లను క్రమబద్దీకరించాలని, అనుమతిలేని ప్రకటన బోర్డులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైలింగ్‌కు పెయింటింగ్ రెండవ సారి వేయాలని, సెంట్రల్ మీడియంలోని ఖాళీలో నూతనంగా మొక్కలు నాటాలని, పాతబడిన సూచిక బోర్డులను తొలగించి నూతనంగా ఏర్పాటు చేయాలని, బస్ షెల్టర్లను ఆధునీకరించాలని, మొక్కలకు ట్రిమ్ చేస్తూ, ప్రధాన రహదారి పొడుగునా ఉన్న ప్రతి మొక్కకు రోజు వారి నీరు పోయాలని ఆదేశించారు. మాధవధార రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అందంగా తయారుచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు, హార్టికల్చర్ డీడీ ఎం.దామోదరరావు, జోనల్ కమిషనర్లు ఆర్‌జివి.కృష్ణ, సింహాచలం, మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజనీర్ కె.వేణుగోపాలరావు, డీసీపీ సంజయ్య, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఎఎంఒహెచ్‌లు, ఏసీపీలు, ఇతర జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.










