Sep 22,2023 00:44

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలో మరింత ఎక్కువగా సూక్ష్మ సాగు (మైక్రో ఇరిగేషన్‌) చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి అధికారులను కోరారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూక్ష్మ సాగు చేయడం ద్వారా వచ్చే లాభాలను గూర్చి అందరికీ అవగాహన కలిగించాలన్నారు. ఉద్యానవన సాగులో పామాయిల్‌, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. సూక్ష్మ సాగుకు ప్రభుత్వం కల్పించే రాయితీలను గూర్చి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సూక్ష్మ సాగు అధికారి జివి.లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 1500 హెక్టార్లకు మించి సూక్ష్మ సాగు చేయించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి గల వ్యక్తులకు 90శాతం, 5 ఎకరాల నుంచి 12.5 ఎకరాల మధ్యగల వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1618 మంది రైతులకు చెందిన 1673.54 హెక్టార్ల భూమిని సూక్ష్మ సాగుకు రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎంఐఏఓలు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.