ప్రజాశక్తి -కశింకోట
ఉత్తరాంధ్ర జిల్లాల జీవనాడీ అయిన బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కోసం జగన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని ఉగ్గినపాలెం గ్రామంలో శనివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ఉత్తరాంధ్ర భూములు బీడు భూములగా మారుతున్నాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని పంట కాలువలు, గ్రోయిన్లను మరమ్మతులు చేయకపోవడం వల్ల రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసిపి పాలనలో వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందని ఆరోపించారు. ఒక్క మిస్డ్ కాల్‌తో వైసిపి నిరంకుశ పాలనపై టీడీపీ చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కాయల మురళి, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి, కరణం సోమేశ్వరరావు, కరణం గోవింద, సిదిరెడ్డి శ్రీనివాసరావు, వెంకటేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.










