Jul 31,2023 20:46

గాయాలైన చిన్నారులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని సూగూరు గ్రామంలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి ముగ్గురు పిల్లలను కరిచింది. గ్రామానికి చెందిన బెస్త మస్తాన్‌ కుమారుడు ప్రమోద్‌, కురువ దేవరనాగుడు కుమార్తె దివ్య, బుజ్జి కుమారుడు ప్రణీత్‌లు ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిచ్చి కుక్క దాడి చేసిందని సోమవారం తల్లిదండ్రులు తెలిపారు. ప్రమోద్‌ చేతిపై దాడి చేసి కరవడంతో గాయాలయ్యాయి. దివ్య చేతిని కరిచింది. ప్రణీత్‌ ముఖంపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. స్థానికులు, తల్లిదండ్రులు పిచ్చికుక్కను చంపినట్లు తెలిపారు. గాయపడిన పిల్లలను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు భయపడుతున్నారు. గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని గ్రామంలో లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.