May 15,2023 02:03
గంగవరంలో జరిగిన వైద్య శిబిరంలో రోగులను పరీక్షిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-పంగులూరు: షుగరు, బీపీ, ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోగులకు వైద్యులు పిలుపు నిచ్చారు. ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలోగల, మంచాల వెంకటరామయ్య, రంగమ్మ విజ్ఞాన కళ్యాణ మండపంలో, గంగవరం ప్రాంత ఆరోగ్య సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో, ఆదివారం జరిగిన షుగర్‌, బీపీ రెగ్యులర్‌ ఉచిత వైద్య శిబిరంలో పలువురు వైద్యులు ప్రసంగించారు. పేద ప్రజలు లక్షలాది రూపాయలు చిన్న చిన్న వ్యాధులకు కూడా ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి వైద్య శిబిరాల్లో వైద్యుల సలహాలు తీసుకొని ఖర్చులేని వైద్యాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు అన్నవరపు సాంబయ్య మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతోందని, షుగరు, బీపీ వంటి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. దాతలు, అభ్యుదయ వాదుల సహకారంతో, ఇలాంటి వ్యాధులకు ఖర్చు లేని వైద్యాన్ని తీసుకోవచ్చని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అన్నారు. డాక్టర్‌ వి టైటస్‌ మాట్లాడుతూ సరైన మందులు వాడుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. డాక్టర్‌ మంచాల రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు వారి ఆరోగ్యాలకు భరోసా ఇచ్చేందుకే గంగవరం ప్రాంత ఆరోగ్య సంక్షేమ వేదిక ఏర్పడిందని, దీనిని పేద ప్రజలంతా ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం షుగరు, బీపీ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్షలు చేసి రెండు నెలలకు సరిపడా మందులను 200 రూపాయలకే అందించారు. ఈ నెల వైద్య శిబిరాన్ని మంచాల వెంకటరామయ్య, రంగమ్మ, మంచాల అనంత విజయలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడెంపూడి సురేంద్ర కమలాకర్‌ అధ్యక్షత వహించగా, ఆర్‌ఎంపి మాలకొండయ్య, బోడెంపూడి సూరిబాబు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మాజీ కార్యదర్శి వై సిద్దయ్య, మంచాల సరోజిని తదితరులు ప్రసంగించారు. మందుల పంపిణీలో గంగవరం ప్రాంత ఆరోగ్య సంక్షేమ వేదిక కన్వీనర్‌ కే బాలచందర్‌, బాపట్ల జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు, కే సృజన సహకారం అందించగా, రక్త పరీక్షలను తలమాల ఏసుబాబు నిర్వహించారు.