Feb 06,2022 13:12

ప్రతీ వంటింట్లోనూ సుగంధ ద్రవ్యాలు గుప్పించే పోపుల పెట్టి గరమ్‌ మసాలా దినుసుల భరిణె. మసాలా దినుసులు 'స్పైసీ'నే కాదు చక్కటి దివ్య ఔషధాలు కూడా. నిత్యం మనం ఉపయోగించడమే తప్ప ఏయే మసాలాలు ఏ మొక్కలకు కాస్తాయి? అవి ఎలా ఉంటాయి? ఏయే ప్రాంతాల్లో అవి లభిస్తాయి? అనేది కొందరికే తెలుసు. మనకి అరుదుగా కనిపించే అటువంటి మొక్కల గురించి ఈ వారం తెలుసుకుందాం..!

                                                                           జీలకర్ర

సుగంధాల మొక్కలు

సన్నగా, చిన్నగా ధాన్యం ఆకారంలో ఉండేది జీలకర్ర. దీనిలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. అవి సాధారణ జీలకర్ర, నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కేవలం ఔషధాల్లోకి మాత్రమే వినియోగిస్తారు. అత్యల్ప కాలంలో పంట వచ్చేది జీలకర్ర మొక్క. ఇది నాటిన 100 నుంచి 120 రోజుల్లోనే కాపు వస్తుంది. మొక్క రెండున్నర నుంచి మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం 'కుమినమ్‌ సైమినమ్‌'. ఇది అపోయాసి కుటుంబానికి చెందిన పుష్పించే జాతి మొక్క. సన్నని కొమ్మలకు గుత్తుగుత్తులుగా పువ్వులు విచ్చుకుంటాయి. పువ్వులు తెల్లగా, లేతనీలంగా ఉంటాయి. ఆకులు సన్నగా, పొడవుగా, పచ్చగడ్డిని పోలి ఉంటాయి. డిసెంబర్‌ మాసం జీలకర్ర విత్తనాలు నాటటానికి అనువు. వారానికి ఒకసారి కొద్దిగా నీరు పోయాలి. మొక్క మొదలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు నిలువ ఉండకూడదు. గాలిలో తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే జీలకర్ర మొక్కలు బాగాపెరుగుతాయి. పువ్వులు ఎండిపోయిన తరువాత వాటి కాయల్లో జీలకర్ర ఉంటుంది. మొక్కను పీకేసి, దాన్ని దుళ్ళకొట్టి జీలకర్రను పొందొచ్చు.

                                                               

                                                                     దాల్చిన చెక్క

సుగంధాల మొక్కలు

దాల్చిన చెక్క వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం అనే చెట్టు బెరడు నుండి లభిస్తుంది. దీని పుట్టుక శ్రీలంక. చెట్టు 10 నుంచి 15 అడుగుల వరకూ పెరుగుతుంది. ఆకులు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి. ఇది గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయి. చెట్టు పెరిగే కొలదీ చుట్టూతా ఉండే కొమ్మలు కత్తిరించాలి. నాటిన ఐదేళ్ల తరువాత నుంచి దాల్చిన చెక్క బెరడు తీసుకొని వాడుకోవచ్చు. వీటిని సువిశాల ఇండ్ల పెరటిలో పెంచుకోవచ్చు. చెట్టు మొదలు నీళ్లు నిలువ ఉండకూడదు.

                                                                          లవంగాలు

సుగంధాల మొక్కలు

ఎన్నో ఔషధ విలువలు కలిగిన సుగంధద్రవ్యం లవంగం. ఇది ఇండోనేషియాకు చెందిన ఒక సతత హరిత వృక్షం. యూరప్‌, ఆసియా ఖండాల దేశాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు. లవంగాల మొక్క 10 నుండి 20 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. మొక్కదశ నుండి వృక్ష దశకు చేరుకునే సమయానికి వాటి ఆకులు రాగి రంగు నుండి ఆకుపచ్చగా మారుతాయి. వీటి పువ్వులు గుత్తులుగా విచ్చుకుంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం లేని పంట. ఇవి నాటిన నాలుగేళ్లకు పంట దిగుబడి మొదలవుతుంది. సారవంతం అయిన గరప నేలలు ఈ పంట సాగుకు ఉపయోగకరం. ఇసుక నేలల్లో లవంగం పంట పండడం చాలా కష్టం. మనరాష్ట్రంలో అరకు ప్రాంతాల్లో కొంత వరకు ఈ వాతావరణం ఉంటుంది. పువ్వు మొగ్గ శాఖ యొక్క కొనభాగంలో చిన్న కొమ్మపై లవంగాలు ఉత్పత్తవుతాయి. మొగ్గ ఎప్పుడైతే లేత ఎరుపు రంగులోనికి మారతాయో అన్నింటినీ సేకరించాలి. సాధారణంగా లవంగాలు ఫిబ్రవరి నుండి మేవరకూ దిగుబడి బాగా వస్తాయి. జంజిబర్‌ లవంగాలు సాధారణంగా ఆగష్టు నుండి డిసెంబరులో కోతకు వస్తాయి. ఒక చెట్టు నుండి ఎండిన లవంగం రెండు కి.గ్రా. వరకూ వస్తాయి. లవంగం చెట్లు 60 సంవత్సరాల వయస్సు వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడిని ఇవ్వగలవు. ప్రత్యేక శ్రద్ధ పెట్టగలిగితే ఇళ్లదగ్గరా పెంచుకోవచ్చు.

                                                                         యాలకులు

సుగంధాల మొక్కలు

మసాలా దినుసుల్లో రారాజుగా పిలిచేది యాలకులు. ఎన్నో రుగ్మతలకు, రోగాలకు ఇది దివ్య ఔషధం. సుగంధాలు వెదజల్లే మసాలా పోపు ఇది. దీని ఖరీదు ఎక్కువే. చెట్టు పూత వేసిన తరువాత యాలకుల పంట చేతికి రావడానికి మూడేళ్లు సమయం పడుతుంది. మొదట పువ్వులు వస్తాయి. కాయలుగా రూపాంతరం చెందుతాయి. తరువాత పండ్లుగా మారుతాయి. వాటి నుంచి యాలకులు సేకరించి శుభ్రం చేసి ఎండబెట్టాలి. ప్రతీ దశలో బోలెడంత శ్రమ ఉంటుంది. అందుకే వీటికి అంత ధర. యాలకులు ఉత్పత్తి చేసే దేశాలలో భారత్‌ ఒకటి. యాలకులు మొక్క మొదట నుంచి ప్రత్యేకమైన కొమ్మలు వచ్చి వాటికి కాపు కాస్తాయి. నాలుగు రోజులకు ఒకసారి నీటి వనరు అవసరం. మొక్క మొదళ్లలో నీరు నిలువ ఉంటే చనిపోతాయి. ఇంట్లో కుండీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు.

                                                                        గసగసాలు

సుగంధాల మొక్కలు

మసాలాల్లో మరో చిరు దినుసు గసగసాలు. ఇవి కూడా ఘాటైన సువాసనలు ఉంటాయి. వీటినీ వైద్యంలో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. వీటిని ఓపియం బేబీ సీడ్స్‌ అంటారు. విత్తనాలు ఒకరోజు నానబెట్టి జల్లితే వారం రోజులకి మొక్కలు వస్తాయి. వాటిని తీసి దూరంగా నాటాలి. మూడు నెలల తరువాత మొక్కలు రెండు నుంచి నాలుగు అడుగులు పెరుగుతాయి. వాటికి పూసిన తెలుపు, ఎరుపు పువ్వులను తుంచితే పూస్తాయి. వాటిని తుంచితే అడుగున కాయలు ఉంటాయి. వాటికి గాట్లు చేస్తే పాలవంటి ద్రవం వస్తుంది. దీని నుంచే నల్లమందు తయారు చేస్తారు. పక్వానికి వచ్చిన కాయలను సేకరించి, ప్రాసెస్‌ చేస్తే గసగసాలు వస్తాయి. ఈ మొక్కలను ఇళ్ల దగ్గర కూడా పెంచుకోవచ్చు. నేలలో తేమ ఉండాలి. వారానికి ఒకసారి నీరు పెట్టాలి.