Nov 22,2022 23:58

స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కిరణ్‌, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఎటపాక
సీపీఎం మండల నాయకులుగా పని చేసిన కామ్రేడ్‌ సుధబాబు ఆశయాలను కొనసాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. మండలంలోని మురుమూరులో సుధబాబు 3వ వర్ధంతి సభ కాకా అర్జున్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముందుగా పార్టీ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో రెండో పంటగా చెప్పుకునే తునికాకు సేకరించే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాల్లో సుధబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. పోలవరం నిర్వాసితుల తరఫున పోరాడి జైలు జీవితం గడిపారన్నారు. నిర్వాసితులను ముంచేసే పోలవరం వద్దని నాడు చేసిన పోరాటాన్ని కొనసాగిస్తూ పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా నాయకులు మర్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి సుధబాబు ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఐవి, నాయకులు పులుసు బాలకృష్ణ, ఐ.పద్మ, సోయం వీరమ్మ, పొడియం రత్తమ్మ, జి.హరనాధ్‌, ఎ.నాగేంద్ర, ఆసు ప్రసాద్‌, సుధబాబు భార్య హేమలత, కుమారుడు రాజా పాల్గొన్నారు.