Nov 03,2022 23:33

రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్త భవాని

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని పెదదొడ్డిగల్లు, చినదొడ్డిగల్లు, గొడిచెర్ల, కాగిత, ఉద్దండపురం గ్రామాల్లో సుడిదోమ సోకిన వరి పొలాలను గురువారం విశాఖపట్నం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త టి.భవానీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు సుడిదోమ నివారణపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. రైతులు ఎక్కువగా వాడే సాంబ మసూరి, ఆర్‌జెఎల్‌ రకాల్లో సుడిదోమ వ్యాపిస్తోందని, దీని దృష్ట్యా రైతులు మార్టేరు రకాలు వాడాలన్నారు. సుడిదోమ నివారణకు పైమెట్రోజిన్‌ లేదా డైనోటేఫ్యూరాన్‌ వాడాలన్నారు. మందును ఎలా పిచికారీ చేయాలో అవగాహన కల్పించారు. అవకాశం వున్నంత వరకూ పొలంలో నీరు తీసేసి, సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌, ఏఈవో సత్యనారాయణ, ఆర్‌బికే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.