ప్రజాశక్తి - బలిజిపేట : శుద్ధమైన ఓటర్ జాబితా తయారు చేయాలని, యువతను ఓటరుగా నమోదు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి, ఓటరు నమోదు అధికారి కె.హేమలత తెలిపారు. నియోజకవర్గంలో మరణాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని పణుకువలస పిఎస్ నెంబర్ 167, సుభద్ర 169,170 పోలింగ్ కేంద్రాలు, బలిజిపేట మండలం బడేవలస గ్రామాల్లోని పిఎస్ నెంబర్ 171 కేంద్రంలో మరణాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌ను తనిఖీ చేశారు. బూత్ స్థాయి అధికారులు తమ వద్ద ఫారం - 6, 7, 8 అందుబాటులో ఉంచుకొని అవసరమైన వారికి అందజేయాలని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, పెళ్లయి వేరొక ఊరు వెళ్ళిపోయిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు అర్హులని, 2024 జనవరి 1 నాటికి 18ఏళ్లు పూర్తి అయిన ప్రతి యువత ఓటరుగా నమోదు కావాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.