Jul 28,2023 22:02

బూస్ట్‌ పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ రామప్పలనాయుడు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : పట్టణ ప్రజలకు శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామ అప్పలనాయుడు ఇంజనీరింగ్‌ అధికారి జి.ఆనంద్‌కు సూచించారు. శుక్రవారం ఎఇతో కలిసి కొత్తవలస శివారులో రాళ్లగెడ్డ వద్ద పట్టణానికి తాగు నీటిని సరఫరా చేసే బూస్టర్‌ పంప్‌ హౌస్‌ను సందర్శించారు. బూస్టర్‌ పంప్‌ హౌస్‌లో పనిచేస్తున్న మోటార్ల పనితీరును, విద్యుత్‌ సరఫరా సమయాలను కమిషనర్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎఇతో మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో కొన్ని రోజులుగా కుళాయిల ద్వారా రంగు మారిన తాగునీరు సరఫరా జరుగుతున్న దృష్ట్యా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయని, దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో, పాటు పాలక పక్ష కౌన్సిల్‌ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ శుద్ధజలాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తోటపల్లి పంప్‌ హౌస్‌ ద్వారా సరఫరా జరిగే తాగునీటిని బూస్టర్‌ పంపు హౌస్‌ వద్ద కొంత సమయం శుద్ధి చేసి పట్టణ ప్రజలకు శుద్ధ జలాల సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు.