సూచించండి..విమర్శలొద్దు..!
ప్రజాశక్తి - తిరుమల
శేషాచలం అడవుల్లో తిరుమల నడకదారి సమీపంలో చిరుతలు సంచరించి ఓ చిన్నారిని బలి తీసుకోవడంతో గత కొన్ని రోజుల నుంచి భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే టిటిడి ఫారెస్టు అధికారులు చిరుతలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి బోనులు అమర్చడంతో తాజాగా తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక దారిలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దగ్గర అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో లక్షిత ఘటన జరిగిన రెండు రోజులకు చిక్కింది. నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లోనే మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కడం గమనార్హం. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడం జరిగింది. 50 రోజుల వ్యవధిలో చేపట్టిన 'ఆపరేషన్ చిరుత'లో మూడు చిరుతలను అధికారులు బంధించారు.
తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు. తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత ఆడదిగా అధికారులు గుర్తించారు. ఆ చిరుత చిక్కిన ప్రదేశానికి దగ్గరలోనే మరో చిరుత చిక్కడం గమనార్హం. చిరుతను ఎస్వీ జూ పార్క్ తరలించనున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
సీసీ కెమెరాలతో నిఘా : టిటిడి ఈవో
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
శేషాచల అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా వన్య మగాల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులులు చిరుతలు వంటి వన్యమగాల వ్యవహార శైలిపై నిపుణులతో చర్చించామన్నారు. 15 సంవత్సరాల పైబడిన వారిపై అవి దాడి చేయబోవని తెలిపారు. భద్రతా చర్యలో భాగంగా ఇప్పటికే అనేక చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, టపాకాయలు వంటి శబ్దాలు వినిపించేలా చర్యలు తీసుకున్నామని, నడకదారి మార్గంలో ఇరుపక్కల ఫ్లడ్‌లైట్లు కాంతులను వెదజల్లేలా ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఇప్పటికే మూడు చిరుతపులులను బంధించామని, ఒక దానిని పరిశీలించి అడవుల్లో విడిచి పెట్టామని, మరో రెండిటిని జూ పార్కులో నిపుణుల పర్యవేక్షణలో ఉంచామని, వాటికి సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించామని, ఫారెస్ట్ అధికారులు, అందుకు సంబంధించిన అధికారుల సూచనలు సలహాలు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కొన్ని వేల సంవత్సరాల నుంచే తిరుమలకు నడక మార్గం ఉందని, అక్కడ ఎలాంటి కంచె ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. రిస్క్ జోన్ అనేది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందన్నారు. అక్కడ కంచే ఏర్పాటు విషయమై ఫారెస్ట్ అధికారులకు విన్నవించామన్నారు, వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే 15 సంవత్సరాలు లోపు పిల్లలు ఉన్న వారిని మధ్యాహ్నం రెండు గంటల లోపు వరకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. భక్తుల్లో కాస్త భయాన్ని తొలగించే ధైర్యాన్ని ఇచ్చేందుకే తోడుగా కర్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇది పులుల నుంచి రక్షణ కల్పించక పోయిన భక్తులకు ధైర్యాన్ని కలిగిస్తుందన్నారు. కానీ దీనిపైన సోషల్ మీడియాలో ఎగతాళి చేయడం సరైనది కాదని హితవు పలికారు. వన్య మగాల దాడులు బాధాకరమని, వాటి నుంచి భక్తులను కాపాడేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ, ఎద్దేవా చేయడం మంచి పరిణామం కాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ టిటిడి కి సహకరించి భక్తులకు రక్షణ కల్పించేందుకు సహకరించాలన్నారు.
పులుల దాడి వెనుక గుట్టు విప్పాలి
ఎర్రస్మగ్లర్ల వ్యవహారం తేల్చాలి : ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి
ప్రజాశక్తి - తిరుపతి (మంగళం)
తిరుమలలో చిరుత పులుల దాడుల వెనుక మర్మాన్ని అధికారులు వెల్లడించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తారు. మూడు రోజుల క్రితం ఆరేళ్ళ బాలికను పొట్టన పెట్టుకున్న పులి బోనులో చిక్కిందని అధికారులు చెప్పడంలో నిజం లేదన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు పేలుళ్లు సష్టించి పులులను భయ పెట్టడం వల్లనే అవి ప్రజల మధ్యకు వస్తున్నాయన్న ఆరోపణలపై అధికారులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. స్మగ్లర్ల వెనుక అధికార పార్టీకి చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నందు వల్లే అధికారులు ఎవరూ మాట్లాడటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. టిటిడి, అటవీశాఖ అధికారులు ఈ వ్యవహారంపై నిజాలు మాట్లాడటానికి భయపడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి జోక్యం చేసుకోవాలని సుధాకర్ రెడ్డి కోరారు.
స్మగ్లర్ల అలజడితోనే చిరుతలు : బిజెపి
శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకులకు వాటాలు అందుతున్నాయని, అడవిలో వందల వేల సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని పర్యవసానమే అడవిలో ఉండాల్సిన మగజాతులు బాహ్య ప్రపంచంలోకి వచ్చి దాడులకు తెగబడుతూ ప్రాణ నష్టం కలిగిస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిటిడి, అటవీ శాఖ అధికారులు మధ్య సమన్వయం కొరవడిందని, దీని పర్యవసానమే భక్తులపై చిరుతలు దాడి చేస్తున్నా పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఓవైపు చిరుతల సంచారంతో శ్రీవారి భక్తులు బిక్కుబిక్కుమంటూ శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తుంటే, చేతికి కర్ర కూడా ఓ పరిష్కారమే అనడం ఎంతవరకు సమంజసమో టీటీడీ ఆలోచించుకోవాలన్నారు.
చేతి కర్రిచ్చి చేతులు దులుపుకున్నారు
శ్రీకాళహస్తి : ఎన్నడూ లేని విధంగా తిరుమల నడక దారుల్లో చిరుతలు సంచరిస్తున్నాయని, చిన్నారులపై దాడులు చేస్తున్నాయని జనసేన జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ విమర్శించారు. కేంద్ర అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి లక్షిత మృతి బాధాకరమని, టిటిడినే బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.










