కాలం క్యాలెండర్ మార్చుకునే
సమయం ఆసన్నమైంది
కాలసంద్రంలో పయనించే
గతం తాలూకు కష్టాలు, కన్నీళ్లు కూడా
ఎవరికి వారు ఓర్చుకుని, ఓదార్చుకుని
మరో నూతన వెలుగు కోసం
తమను తాము మార్చుకుని
అడుగు ముందుకు వేయాలి
నిముషాలు చేజారినా
నిర్ణయాలు మారినా
జీవితంలో చేదు స్మృతులను విడిచి
మధురమైన రేపటిని ఆహ్వానిద్దాం
కరోనా యమగండం మరువలేని
విషాదగాథలు మిగిల్చినా..
రాబోయే కొత్త ఏడాది ఉత్సాహాన్ని
మనసునిండా నింపుకుని..
మనోధైర్యం లేపనాన్ని
గుండె గాయాలకు అద్దుకుందాం
మనవారి కోసం, మనకోసం కదులుదాం
ఒకరికొకరు తోడుగా ఆప్యాయతలు పంచుకుంటూ..
మన భవిష్యత్తుకు
నవ వసంతాన్ని రమ్మని చెబుదాం
ఏటేటా కొత్త సంవత్సరాలు
వస్తూనే ఉన్నాయి..
కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని
విషమపరీక్షల అనుభవాలు
మిగిల్చి పోతూనే ఉన్నాయి.
అయినా..
మరో ఏడు వస్తుందంటే
ఏవో ఆశలు చిగుళ్లు వేస్తాయి
మన బ్రతుకులో కఠిన మలుపులు
ఎన్ని ఉన్నా.. గమ్యం చేరాలంటే
కోరికల రెక్కలు కట్టుకుని
పయనించాల్సిందే..
గోడ మీద క్యాలెండర్ పేజీతో పాటు
జీవన పుస్తకంలో
బంగారు భవిత పేజీని తెరుద్దాం
ఆ దేవుని ఆశీస్సులతో
మనకు కోటి శుభాలు కలగాలని
సంతోషంతో నూతన సంవత్సరానికి
శుభ స్వాగతం పలుకుదాం.!!
ములుగు లక్ష్మీ మైథిలి
94400 88482