Apr 20,2021 08:02

మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతాంగ ఉద్యమానికి ఐదు నెలలు పూర్తి కావస్తోంది. స్వాతంత్య్రానంతరం సుదీర్ఘ కాలంపాటు దేశమంతటినీ కదిలించిన రైతు పోరాటమిదే! కార్మికులు, ఉద్యోగుల హక్కుల రక్షణకు, ప్రభుత్వరంగ పరిరక్షణకు అఖిల భారత సమ్మెలతో సహా విశాల కార్మికవర్గ పోరాటాలు ఈ సమయంలోనే జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో వివిధ సమస్యలపై బాధిత ప్రజానీకం ఆందోళనలు, పోరాటాలు సాగించడం, కొన్ని కోర్కెలు సాధించుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. అయితే, వివిధ ఉద్యమాలు, పోరాటాల్లో ఆయా వర్గాలు, తరగతులవారు విడివిడిగా ఆయా సందర్భాల్లో ఉద్యమించడం పరిపాటి. కాని, ఆదివారంనాడు విశాఖపట్నం బీచ్‌లో జరిగిన 'రైతు కార్మిక శంఖారావ సభ' విలక్షణమైనది. కరోనా వ్యాప్తి, పోలీస్‌ ఆంక్షల నేపథ్యంలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఈ సభకు వేలాది మంది రైతులు, కార్మికులు తరలిరావడం అభినందనీయం. సభకు ముందు జరిగిన ప్రదర్శనలో రైతులు, కార్మికులు కదం తొక్కారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో పాటు, నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. అన్ని విధాలా రైతులు, కార్మికుల మధ్య పరస్పర సంఘీభావం, సమన్వయంతో సాగిన ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. శ్రమజీవుల ఐక్యత పెంపొందాలి.


విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామని రైతు, కార్మిక నాయకులు ప్రకటించడం స్వాగతించదగినది. విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనట్టయితే ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాట స్థాయికి 'ఉక్కు' పోరాటాన్ని తీసుకువెళ్తామని, దేశమంతా తిరిగి మద్దతు కూడగడతామని రైతు నాయకులు చెప్పడం శ్లాఘనీయం. విశాఖ ఉక్కు పోరాటానికి 500 రైతు సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని, దీన్ని 'విశాఖ ఉక్కు-దేశ ప్రజల హక్కు' అనే నినాదంగా మారుస్తామని జాతీయ రైతు సంఘాల నాయకుల హామీతోపాటు వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దు డిమాండ్లపై ప్రధానితో జరిపే చర్చల్లో విశాఖ స్టీల్‌ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించడం 'ఉక్కు' ఉద్యమానికి కొండంత అండ. బలిదానాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను పోరాటాల ద్వారానే కాపాడుకోగలమన్న అఖిలభారత కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే దిశా నిర్దేశం స్ఫూర్తిదాయకం. స్టీల్‌ప్లాంట్‌ సాధనకు సాగిన మహోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థి, యువజనులు ఇప్పుడు ప్లాంటు రక్షణకు ఉద్యమిస్తారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు శంఖారావ సభ తప్పక ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.


రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ రైతు నాయకులు విజయవాడ, ఒంగోలు సభల్లో పాల్గొని రైతు ఉద్యమ విస్తరణ ఆవశ్యకతను వివరించి ప్రజా భాగస్వామ్యానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటన రైతులు, కార్మికుల మధ్య ఐక్యత పెంపొందడానికి దోహదపడింది. ఢిల్లీ రైతు పోరాట సారథులకు ఆయా సభల్లో వెల్లువెత్తిన సంఘీభావం, అభినందన సత్కారాలు 'రైతు ఉద్యమం పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాలకే పరిమితమ'న్న బిజెపి నాయకుల ఆరోపణలకు చెంపపెట్టు! నల్ల చట్టాలతో అటు రైతులను, లేబర్‌ కోడ్‌ల పేరిట ఇటు కార్మిక వర్గాన్నీ కార్పొరేట్లకు కట్టు బానిసలుగా చేయాలన్న మోడీ సర్కారు కుట్రలను దేశ ప్రజానీకం క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. బాధిత వర్గాలన్నీ ఒకతాటి పైకి వస్తున్నాయి. ఆయా వర్గాలు, తరగతులవారి విడివిడి పోరాటాలు, ఉద్యమాలు సమన్వయంతో సంఘటిత రూపం దాల్చడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. కార్మిక కర్షక ఐక్యత పెంపొందాలి. చిన్నచిన్న పాయలన్నీ కలిసి ఒక ప్రవాహంగా మారిన రీతిలో ఒక శ్రామిక మహోద్యమాన్ని నిర్మించాలి. అటువంటి విశాల ఐక్య ప్రజా ప్రతిఘటనతోనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల్ని మట్టి కరిపించడం సాధ్యం.