Apr 13,2023 00:19

నివాళులర్పిస్తున్న వి.శ్రీనివాసరావు తదితరులు


ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో/గాజువాక
'ఆఖరి క్షణం వరకూ ఉద్యమమే ఊపిరిగా జీవించిన కమ్యూనిస్టు, ప్రజలతో గొప్ప అనుబంధం గల నాయకుడు జి సుబ్బారావులి అంటూ పలువురు సిపిఎం నేతలు ఆయన్ను కొనియాడారు. బుధవారం ఉదయం షీలానగర్‌లోని అతని స్వగృహానికి సమీపంలోగల పోస్టాఫీసు గ్రౌండ్స్‌లో గాజువాక సిపిఎం నాయకులు జి.సుబ్బారావు సంతాప సభ అత్యంత ఘనంగా జరిగింది. వందల సంఖ్యలో ఆయన అభిమానులు, ట్రేడ్‌ యూనియన్‌, ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు, సిపిఎం నాయకులు తరలి వచ్చారు. సుబ్బారావు అమర్‌రహే... ఉద్యమాలు జిందాబాద్‌ అంటూ అక్కడకు వచ్చిన సిపిఎం, సిఐటియు శ్రేణులంతా నినాదాలు చేశారు. సభా వేదికపై ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో వివిధ పార్టీల నాయకులు ఘనంగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు అధ్యక్షతన జరిగిన సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుబ్బారావులోని కమ్యూనిస్టు అంకితభావాన్ని అభినందించారు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంతో కూలిపోతుందని నమ్మిన సుబ్బారావు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ధృఢ సంకల్పంతో తన జీవిత కాలం కృషిచేశారన్నారు. సోషలిజానిదే భవిష్యత్‌ అని ఆయన నమ్మారని, అందుకు తగ్గట్టుగానే ప్రపంచం మారుతుందని అమెరికా, వెనిజులా వంటి దేశాల్లో పలు పరిణామాలు రుజువు చేస్తున్నాయని ఉటంకించారు. విశాఖ అంటేనే ప్రభుత్వరంగంపై ఆధారపడి ఉన్నందున ఇదొక ఫైనాన్షియల్‌ కేపిటల్‌గా భాసిల్లుతుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇక్కడ లేకపోతే విశాఖ పేరును ఊహించగలమా? అని ప్రశ్నించారు. సుబ్బారావు లాంటి వ్యక్తులు చేసిన పోరాటాల స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు నడుం కట్టాలని, అదే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సుబ్బారావు పనిచేసి ఉద్యమాన్ని నిర్మించారన్నారు. ఈ ప్రాంతంలో 1000 ఎకరాల ఇనాం భూములను పెద్దలు కాజేయ్యాలని చూడగా వాటిని పేదలకు పంచేందుకు జరిగిన పోరాటంలోనూ సుబ్బారావుది కీలకపాత్రేనన్నారు. ఈ విషయంలో నాటి పత్రికల యాజమాన్యాలు ప్రభుత్వం, స్థానిక పెద్దలవైపు ఉండగా ఆనాడు గాజువాకలోని జర్నలిస్టులు మాత్రం తమ యాజమాన్యాల విధానాన్ని ఉల్లంఘించి పేదలకు అనుకూలంగా వార్తలు రాశారని కొనియాడారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ, సుబ్బారావు గాజువాకకే కాకుండా విశాఖ పారిశ్రామిక లోకానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సుబ్బారావును తమ ఇంట్లో ఒక సభ్యునిగా చూసేవారమని, ఆయన మృతిచెందడంతో కుటుంబంలో వ్యక్తి కోల్పోయిన అంత బాధగా ఉందన్నారు. ఆయన కార్మికులకు చేసిన సేవలు మరువలేనివన్నారు. 2017లో తాను కార్పొరేటర్‌ ఉన్నప్పుడు సుబ్బారావు, తాను కలిసి షీలా నగర్‌ ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, బిహెచ్‌పివలో పనిచేస్తూనే ఆటోనగర్‌ కార్మిక సమస్యలపై సుబ్బారావు పోరాటం చేశారన్నారు. భూ పోరాటాన్ని గాజువాకలో జయప్రదం చేశారని తెలిపారు. ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కరోనా సమయంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికుల సమస్యలపై పోరాటానికి విజయవాడ వచ్చారని గుర్తు చేశారు. సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సుబ్బారావు ధన్యజీవి అన్నారు. శ్రామిక మహిళా కన్వీనర్‌ ధనలక్ష్మి మాట్లాడుతూ, సుబ్బారావు కార్మికవర్గ శత్రువుల గుండెల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మ, వై.సత్యవతి, సిఐటియు నాయకులు అయోధ్యరాం, యు.రామస్వామి, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, చందు, సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, క్రాంతి ప్రాపర్టీస్‌ అధినేత చిన్నరావు పాల్గొన్నారు.