ప్రజాశక్తి-నందిగామ
ఎన్టిఆర్ జిల్లాలో సుబాబులు రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘాల నాయకులు గురువారం నందిగామ వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సుబాబులు రైతులకు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం టన్నుకు రూ.4200 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎఎంసిల నియంత్రణలో ట్రేడర్స్, పేపరు కంపెనీలు సుబాబులు కర్ర కొనుగోళ్ళు చేయాలని, లారీ కిరాయిలు కంపెనీలు భరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రేడర్స్, పేపరు కంపెనీలు రైతులను దోచుకుంటూ రోజుకో ధర నిర్ణయిస్తున్నారని, తక్షణమే ట్రేడర్స్, దళారీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సుబాబులు కర్ర కొనుగోళ్ళు చేయాలని, తక్షణమే మార్కెట్ కమిటీ అధికారులు స్పందించి పేపరు కంపెనీలు,ట్రేడర్స్ తో సమావేశం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో సుబాబులు రైతుల ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రైతు సంఘాల నాయకులు చనుమోలు సైదులు, చుండూరు సుబ్బారావు, యర్రా శ్రీనివాసరావు,కటారపు గోపాల్, వాసు తదితరులు పాల్గొన్నారు.










