
ప్రజాశక్తి - నందిగామ : ఎన్టీఆర్ జిల్లాలో సుబాబులు సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ధర ఆశాజనకంగా ఉంది. ఐదేళ్లుగా సుబాబుల్ కర్రకు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. టన్నుకు రూ.2000 రూపాయలు ధర కూడా అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కంపెనీలు టన్నుకు రూ.7200 ఇస్తూ ఖర్చులు పోను రైతుకు ఐదు వేల రూపాయలు గిట్టిబాటవుతుంది. గతంలో సరైన ధర లేక సుబాబుల్ తోటలు తొలగించడం జరిగింది. ప్రత్యామ్నాయంగా ఫైర్లు కూడా వేశారు. ప్రస్తుతం సుబాబులు రైతులకు ధర ఆశాజనకంగా మారినప్పటికీ కర్ర లేకపోవడంతో రైతులకు కొంతమంది మంచి ధర అందుకోలేకపోతున్నారు. సుబాబుల్ కర్ర సరఫరా లేకపోవడంతో కాగిత కర్మాగారాలు ధర పెంచాయి. అయినప్పటికీ కర్ర దొరకని పరిస్థితి నెలకొంది. డిమాండ్- సప్లై ఆధారంగా కర్మాగారాలు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. 8 నెలల కిందట రైతుకు కేవలం 2500 లోపు మాత్రమే ధర వచ్చేది. ఇప్పుడు రైతుల చేతికి 5000 రూపాయలు ధర లభిస్తుంది. ఇంకా ధర పెరుగుతుందని వ్యాపారులు, రైతులు అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు సంవత్సరాల నుండి సుబాబులు సాగు విస్తీర్ణం ఘనంగా తగ్గిపోయింది. గతంలో ఎన్టీఆర్, కష్ణా జిల్లాల్లో 80,000 నుండి లక్ష ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉంది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నూజివీడు నియోజకవర్గంలో సుబాబులు సాగు విస్తరణ ఎక్కువగా పెరగడంతో కంపెనీలు ధర తగ్గించాయి. దళారుల ద్వారా కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గిట్టుబాటు ధర లేక రైతుల సుబాబులు సాగు తగ్గించారు. మరికొందరు ఉన్న తోటలను తొలగించారు. పత్తి, మిర్చి వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు.