Oct 30,2023 20:48

అధికారులను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు

ప్రజాశక్తి-బొబ్బిలి : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చెలికాని మురళీకృష్ణ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ఎన్ని స్థలాలు పేదలకు ఇచ్చారు, మిగిలిన స్థలాలు ఎవరి చేతిలో ఉన్నాయో వివరాలు కావాలని గత సమావేశంలో అడిగితే ఇంతవరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలనీ అక్రమాల వెనుక ఎవరి హస్తం ఉందని వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ కాలనీలో అక్రమాలు జరగడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మరో వైస్‌ చైర్‌పర్సన్‌ జి.రమాదేవి అన్నారు. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అక్రమాలపై రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అది పూర్తయిన వెంటనే వివరాలు ఇస్తామని టిపిఒ వరప్రసాద్‌ అన్నారు. టిడిపి ఫ్లోర్‌లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పూల్‌బాగ్‌ రోడ్డు బాగు చేయాలని, తమ వార్డులో సామూహిక మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పనుల్లో వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడితల్లి కాలనీలో కల్యాణ మండపం స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వవద్దని కౌన్సిలర్‌ కాకల గోవిందమ్మ డిమాండ్‌ చేశారు. తమ వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోలేదని టిడిపి కౌన్సిలర్‌ వి.హైమావతి మండిపడ్డారు. పట్టణంలో ప్రతి బుధవారం నిర్వహించే సంత కరోనా లాక్‌డౌన్‌ నుంచి జరగడం లేదని, సంత ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైసిపి కౌన్సిలర్లు చోడిగంజి రమేష్‌ నాయుడు, తెంటు పార్వతి కోరారు. పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్‌ మురళి, కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.