ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో వైసిపి భూ కబ్జాకు హైకోర్టు స్టే ఇచ్చి బ్రేక్ వేసింది. అల్లూరి జిల్లా కేంద్రం లో చింతలవీధి పంచాయతీ నడింవీధి గ్రామంలో గిరిజన రైతుల సాగు బడిలో ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లీజు పద్ధతి పై భూమి పొంది నిర్మాణ పనులు చేపట్టింది. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాణ పనులను అడ్డుకుంటూ ఆ గ్రామ గిరిజనులతో కలిసి ప్రత్యక్ష పోరాటం చేపట్టిన ఏపీ గిరిజన సంఘం వైసిపి పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు చట్ట విరుద్ధమని పోరాటం కొనసాగించింది. వైసిపి ప్రభుత్వం గిరిజన రైతు మజ్జి పోల్లన్న కుటుంబం గత 75 సంత్సర కాలంగా సాగు చేస్తున్న భూమి లో వైసిపి ఆఫీస్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాడేరు మండలం చింతలవీధి పంచాయితీ నడింవీది గ్రామంలో మజ్జి పోల్లన్న సాగు చేస్తున్న భూమి సర్వే నెం. 151 లో 2 ఎకరాల భూమిలో వైసిపి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి స్థలంను జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల మధ్య మాత్రమే భూ బదిలీలు నిర్వహించాలని 1/70 చట్టం పేర్కొన్న వాటిని ధిక్కరించి వైసిపి ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించడం దారుణమని. గిరిజన సంఘం అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైంది. ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి స్థలంను మొండిగా కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్:354 పై సవాల్ చేస్తూ గిరిజన సంఘం మరియు భూ బాధిత కుటుంబాలు మే 12 న రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నిందితులుగా వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవిన్యూ ల్యాండ్), డైరెక్టర్ గిరిజన సంక్షేమశాఖ, అల్లూరి జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, తహశీల్దార్‌లను గిరిజన సంఘం చేర్చింది. వీరందరికి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ ప్రతులు చేరనున్నాయి. రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ గిరిజ నేతర పార్టీకి / సంస్థకు భూమి లీజుకు, లేదా ఏ రూపంలోలో హక్కులు దాఖలు చేయరాదని, వైసిపి ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన రెండు ఎకరాల భూమి 1/70 చట్ట దిక్కరణ కిందకి వస్తుందనీ, 1997లో సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు తీర్పును పొందుపరుస్తూ, తక్షణమే వైసిపి ఆఫిస్ నిర్మాణం పనులు వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పనుల్ని తక్షణమే ఆపాలి: అప్పలనర్స
గిరిజన చట్టాల్ని ఉల్లంఘించిన వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిందని తక్షణమే వైసీపీ కార్యాలయ పనులు నిలుపుదల చేయాలని లేదంటే ప్రత్యక్షంగా అడ్డుకుంటామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనరస హెచ్చరించారు పాడేరు గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం గిరిజన సంఘం జిల్లా నాయకులు సుందర్ రావు భూ భాదిత కుటుంబాల గిరిజనులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార బలంతో అల్లూరి సీతారా మరాజు జిల్లా అధికారులపై ఒత్తిడి కలిగించి, గిరిజనులకు అన్యాయం చేసేందుకు పూనుకున్నారని. తక్షణమే జిల్లా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు అమలు చేసి వైసిపి కార్యాలయ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని, లేకపోతే ప్రత్యక్షంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు ఎల్.సుందరరావు, మజ్జి సత్తిబాబు, మజ్జి నాగరాజు, మజ్జి కొండబాబు, మజ్జి పోలన్న తదితరులు పాల్గొన్నారు.










