ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. యార్డుకు శుక్రవారం 95,543 టిక్కీలు వచ్చాయి. వీటిల్లో సాధారణ రకాలు 23,486, స్పెషల్ వెరైటీలు 49,499, తెల్లకాయలు 22,558 టిక్కీలు ఉన్నాయి. మొత్తం సరుకులో 25 శాతం వరకు తెల్లకాయలున్నాయి. 15 రోజులుగా ధరలు తగ్గాగా రంజాన్ తరువాత పెరుగుతాయని చెబుతున్నారు. సాధారణ రకాలు కనిష్ట ధర క్వింటాలు రూ. 9 వేలు, గరిష్ట ధర రూ. 24 వేలు ఉంది. మోడల్ సగటు ధర రూ.20,500 మాత్రమే ఉంది. మేలురకాలైన తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌్ రకాలు కనిష్టంగా రూ.9000, గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్నాయి. మోడల్ సగటు ధర రూ.21 వేలు పలికింది. తెల్లకాయలు కనిష్ట ధర రూ.5 వేలు, గరిష్ట ధర రూ.12,500 వచ్చింది.
మొత్తంగా ఎక్కువ సరుకు కనిష్ట ధరలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదనే కారణంతో ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మిర్చి కొత్త సరుకు రావడం ప్రారంభమైన తర్వాత గత మూడు నెలల్లో నాలుగు దఫాలుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో అకాల వర్షాల వల్ల మిర్చి నాణ్యత తక్కువగా ఉందనే సాకుతో ధరలు తగ్గించారు. అంతేగాక విదేశీ ఆర్డర్లు కూడా 15 రోజులుగా నిలిచాయి. అంతేగాక రైతులు కోల్డ్ స్టోరేజిల్లో నిల్వకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా రావడంతో పెట్టుబడి అధికం కావడంతో, ధరలు ఆశించిన విధంగా రాకపోవడం వల్ల ఉన్న సరుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్లల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక కొంతమంది రైతులు కళ్లాల్లోనే విక్రయించుకుంటున్నారు.
ట్రాఫిక్ సమస్యలపై చైర్మన్ దృష్టి
మిర్చి యార్డులో ట్రాఫిక్‌ను నియంత్రణకు చైర్మన్ మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులకు తగు సూచనలు చేశారు. రైతులకు అందించే ఉచిత మధ్యాహ్న భోజనం క్యాంటీన్‌లో తనిఖీలు నిర్వహించారు. మిర్చి దుకాణాల ఎదుట మిర్చి బస్తాలను క్రమ పద్ధతిలో ఉంచాలని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న బస్తాలను క్రమపద్ధతిలో ఉంచాలని ముఠా కార్మికులకు సూచించారు. అనంతరం ఉచిత భోజనశాలను సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించి, భోజనశాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రైతులకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని కాంట్రాక్టరును ఆదేశించారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు. చైర్మన్ వెంట యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.










