ప్రజాశక్తి - చిప్పగిరి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణపై టిడిపిలో తలాతోక లేనివారు విమర్శిస్తే ఊరుకునేది లేదని వైసిపి మండల కన్వీనర్ ఏరూరు రంగస్వామి హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్పరి మండలంలోని సింగిల్‌విండో మాజీ ప్రెసిడెంట్ నౌనేపాటి చౌదరి, టిడిపి నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. జయరామ్ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, చంద్రబాబు మాదిరిగా టిడిపి నాయకులకు కూడా మతిభ్రమించిందన్నారు. చిల్లర రాజకీయాలు చేసే మీకు మంత్రిని, నారాయణను విమర్శించే స్థాయి లేదని తెలిపారు. గతంలో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేశారో పేపర్లలో చూసి తెలుసుకొని అప్పుడు మాట్లాడాలన్నారు. కోట్ల సుజాతమ్మ డోన్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హౌసింగ్ స్కీంలో అవినీతి పేపర్లు కుప్పలు, తెప్పలుగా ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవాలని గుర్తు చేశారు. జయరామ్ మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఒక్క ఫ్యాక్షన్ గ్రామం కూడా లేదని తెలిపారు. ఆలూరులో బట్టి భాస్కర్ అనే వ్యక్తి భట్టి సారా అమ్ముకునే వాడని, జయరామ్‌కు బంధువని ఇంతవరకు వదిలేశామని చెప్పారు. భట్టి భాస్కర్‌కు జయరామ్ ఎలాంటి వారో తెలుసని, ఎవరో మాయ మాటలు చెప్పారని, వారి మాటలు నమ్మి మంత్రిని విమర్శించడం తగదని హెచ్చరించారు. వైసిపి నాయకులు గోవిందరాజులు, బెల్డోన గోవిందు, రాజన్న, ధర్మేంద్ర, కాజీపురం రమేష్, బాలకృష్ణ, షేకన్న, పరమేష్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రంగస్వామి










