May 02,2023 19:31

సమావేశంలో మాట్లాడుతున్న చంద్రకాంత్‌ రెడ్డి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
టిడిపి నాయకులు భూపాల్‌ చౌదరి స్థాయికి మించి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేయడం మంచిది కాదని వైసిపి సీనియర్‌ నాయకులు చంద్రకాంత్‌ రెడ్డి, మధుసూదన శర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం రూ.15 కోట్ల అప్పులు చేశారని, 6 వేల మందికి పింఛన్లు తొలగించారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని టిడిపి నాయకులు భూపాల్‌ చౌదరి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 1.30 లక్షల పర్మినెంట్‌ సచివాలయ ఉద్యోగాలు, 2.30 లక్షల వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. వారికి నెలకు రూ.5 వేలు ఇస్తున్న విషయం నిరుద్యోగ భృతి లాగా కనబడలేదా అని ప్రశ్నించారు. అలాగే ల్యాండ్‌, శాండ్‌, లిక్కర్‌ గురించి కూడా రాష్ట్రంలోని ప్రతి టిడిపి నాయకుడూ మాట్లాడుతున్నారని తెలిపారు. రాజధాని కోసమని అమరావతిలో 35 వేల ఎకరాల భూమిని అన్యాయంగా రైతుల నుంచి చంద్రబాబు లాక్కున్నారని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహిళా తహశీల్దార్‌ నీరజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారని, లిక్కర్‌ పాలసీని అమలు చేస్తూ జిఒలు జారీ చేశారని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ బోయ శాంత, దేవా, కౌన్సిలర్‌ చలపతి పాల్గొన్నారు.