ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
2024 చింతలపూడి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ ఎస్‌సి సెల్ మండల అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తంచేశారు. బుదవారం పార్టీ కార్యాలయంలో గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దు అను నినాదాన్ని టిడిపి అధిష్టానానికి వినిపిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న స్థానికేతర అభ్యర్థులకు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న చాలా ప్రధాన సమస్యలు తెలియదని చెప్పారు. వార్డుల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు తెలియకపోవడం వల్ల చింతలపూడి నియోజకవర్గంలో నాన్ లోకల్ అభ్యర్థులు ప్రజలకు తగిన న్యాయం చేయలేకపోతున్నారని తెలిపారు. దీనివల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. స్థానికేతర అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఐదు సంవత్సరాల అనంతరం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తంచేశార. నియోజకవర్గ అభివృద్ధిని వెనక్కి నెట్టి, పార్టీని ప్రశ్నార్థకంగా చేసి వెళ్లిపోతున్నారని, కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకునే నాధుడే లేకుండా నియోజకవర్గ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుకు వినతిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాతూరి అంబేద్కర్, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, ఐటిడిపి చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్‌కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఎస్‌సి సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను, చింతలపూడి నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్, ఎమ్మెల్యే ఆశావాహి గద్దె శివ కోటేశ్వరరావు, ఏలూరు జిల్లా తెలుగు యువత కార్యదర్శి బొకినాల వాసు పాల్గొన్నారు.










