Nov 30,2022 23:15

భీమిలి నియోజక వర్గం

అపుడే ఊపందుకున్న రాజకీయ సమీకరణలు
పట్టు నిలుపుకునే పనిలో అధికార వైసిపి
పూర్వ వైభవం కోసం టిడిపి ఆరాటం
ఎలాగైనా పాగా వేయాలని జనసేన యత్నం
వ్యూహ, ప్రతివ్యూహల్లో ప్రధాన పార్టీలు

ప్రజాశక్తి - విశాఖపట్నం : 2024లో భీమిలి రాజకీయ ముఖచిత్రం మారనుందా? అవుననే అంటున్నారు కొందరు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో అన్నిపార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉండడం, ఒక్కోసారి ఒక్కొ పార్టీ విజయం సాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై బలమైన చర్చలు, వాదనలు జరుగుతున్నాయనే చెప్పాలి .ప్రస్తుతానికి స్థానికత డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.
అతి పెద్ద నియోజక వర్గం భీమిలి...
తాజాగా వెలువడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే గనుక విభజిత విశాఖ జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం భీమిలినే. ఓటర్లతో పాటు విస్తీర్ణం కూడా ఎక్కువే. ప్రధాన సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఇటీవల నవంబర్‌ 9న విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం 3,18,624 మంది ఓటర్లుండగా, పురుషులు 1,57,826 మహిళలు 1,60,777 మంది ఉన్నారు.
అపుడే ఊపందుకున్న రాజకీయ సమీకరణలు
నిర్దేశిత గడువు 2024కంటే ముందుగానే ఏడాది ముందు 2023లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని ఊహాగా నాలు వినిపిస్తున్న నేపథ్యంలో అపుడు రాజకీయ సమీక రణల జోరు ప్రధాన పార్టీల్లో ఊపందుకుందనే చెప్పాలి.
స్థానికత చుట్టూ 2024 ఎన్నికలు?
2024 ఎన్నికల్లో రాజకీయ సమీకరణలన్నీ స్థానికత చుట్టూ కచ్చితంగా తిరగనున్నాయనే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పక్కనే ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి,అల్లూరి, జిల్లాల్లోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లో స్థానికులే అక్కడ ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలోనూ అలాగే జరగాలని స్థానిక యువత భావిస్తోందని,ఇప్పటికే వైసిపి కేడర్‌ ఈ విషయాన్ని సిఎం జగన్‌ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో స్థానిక యువతకే అవకాశం కల్పించాలని పార్టీ అధినేత జగన్‌ వద్ద ప్రస్తావించినట్లు భోగట్టా. అందుకు తగ్గట్టుగానే తాజా రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైపైకి 'అభ్యర్థి ఎవరనేది అప్రస్తుతం, జగన్‌ అదేశాలే శిరోధార్యం' అని మెజారిటీ కార్యకర్తలు అంటున్నప్పటికీ, లోలోపల స్థానికత అంశం బలంగా పనిచేయనుందని తెలుస్తోంది.
పట్టు నిలుపుకునే పనిలో అధికార వైసిపి
రాష్ట్రమంతటా ఫ్యాన్‌ సుడిగాలి వేవ్‌లోనూ భీమిలి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన ఇక్కడ గెలుపొందిన వైసిపి, మరలా సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న ఆరాటంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలే పార్టీ విజయావకాశాలను ప్రభావితవం చేస్తాయని భావిస్తు న్నారు. పోటీలో ఉన్న వ్యక్తులు కంటే, 2019 మాదిరి గానే, సిఎం జగన్‌ ఛరిష్మా, అమలు చేసిన పథకాలతోనే 2024 ఎన్నికలకు వెళ్లేందుకు అధికారపార్టీ ఎన్నికలకు సిద్ధం కానుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .
పూర్వ వైభవం కోసం టిడిపి
భీమిలి నియోజకవర్గంలో ఎవరు ఔనన్నా, కాదన్నా బలమైన కేడర్‌ ఉన్న టిడిపి మరోమారు ఇక్కడ గెలుపొందడం ద్వారా పూర్వవైభవం కోసం పాకులాడుతుందనే చెప్పాలి. ఇక్కడున్న ఎన్‌టిఆర్‌, బాలకృష్ణ అభిమానులు టిడిపికి రాజకీయంగా అదనపు బలమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. 019 ఎన్నికల్లో టిిడిపి అభ్యర్థి సబ్బం హరికి 91,598 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు 1,00,540 ఓట్లు పడడంతో కేవలం 8,942 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీన్ని బట్టి టిడిపికి భీమిలిలో ఎంత పట్టుందో వేరే చెప్పనక్కరలేదు. ఈ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం టిడిపిలోనూ స్థానికత అంశానే అధినేత చంద్రబాబు వద్ద బలంగా వినిపించాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు అనుయాయులు యోచిస్తున్నట్లు సమాచారం.
పాగా వేసేందుకు జనసేన ఆరాటం
అధికార వైసిపి, ప్రధాన విపక్షం టిడిపిలాగానే జనసేన పార్టీకూడా ఇక్కడ పాగా వేసేందుకు ఆరాటపడుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయాన్ని ఇక్కడ గమనంలో పెట్టుకోవాలి. 2019ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్‌కు ఊహించినదాని కంటే ఎక్కువగానే 24,114ఓట్లు రావడంతో దాన్ని పునాదిగా చేసుకుని రానున్న ఎన్నికలకు వెళ్లాలని జనసేన భావిస్తోంది. మునుపటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఆదరించిన మెగా అభిమానులతోపాటు, పవన్‌కల్యాణ్‌ ఛరిస్మా రానున్న ఎన్నికల్లో బాగా లాభిస్తుందని, భీమిలిలో జనసేన విజయం సాధిస్తుందని జనసైనికులు ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడ కూడా వైసిపి, టిడిపిలాగానే స్థానికత అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి ఎన్నికల బరిలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎవరికి వారే ధీమా
భీమిలి నియోజకవర్గంలో అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపితోపాటు జనసేన పార్టీకి కూడా మంచి కేడర్‌ ఉండడంతో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు గెలుపుపైనే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిపైగానే సమయం ఉండడంతో పొత్తులు, రాజకీయ సమీకరణలు గెలుపోటములు ప్రభావితం చేయనున్నప్పటికీ, ప్రస్తుతానికి మూడు పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్థానికత అంశం ప్రధానంగా చర్చలో ఉండడం విశేషం.