ప్రజాశక్తి-తాడేపల్లి : పట్టణంలోని వెంకయ్య కొట్టు సెంటర్, సలాం హోటల్ సెంటర్, కొత్త వడ్డెరకాలనీ, పోతురాజుస్వామి గుడి, ముగ్గురోడ్డు, లంబాడీపేటకు చెందిన పేదలు తాము నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలిచ్చి ఇక్కడే నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సచివాలయం అధికారులకు బుధవారం అర్జీలు అందజేసి, రాయభారం నిర్వహించారు. రెండ్రోజుల నుంచి ఈ ప్రాంతంలో సిపిఎం కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు రాజధానిలో సెంటు చొప్పున భూమి కేటాయించింది. దీని పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం వెళ్లి తాము నివాసం ఉండలేమని చెబుతున్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఆ స్థలం ఇచ్చే కంటే ప్రభుత్వం ఇప్పుడు నివాసం ఉంటున్న స్థలాలకే పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల దగ్గరకు వెళ్తే అక్కడ ఉన్న రైతులతో కొంత వివాదం నడిచిందని చెబుతున్నారు. ఆ మేరకు బుధవారం సచివాలయంలో సామూహిక అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎస్.ముత్యాలరావు అధ్యక్షతన సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, నాయకులు వేముల దుర్గారావు మాట్లాడారు. 6, 14 వార్డుల సచివాలయాల పరిధిలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న పేదలందరికీ అక్కడే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో 13 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తే దాని మీద లబ్ధిదారుడికి శాశ్వత హక్కు వస్తుందని చెప్పారు. ఈ చట్టాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడకపోవడం శోచనీయమని విమర్శించారు. అంగన్‌వాడీల పోరాట స్ఫూర్తితో ఇళ్ల లబ్దిదారులు పోరడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.కరుణాకరరావు, జి.సుబ్బారెడ్డి, టి.బాబూరావు, డి.విజరుబాబు, డి.శంకరరావు, ఎస్‌కె సుబానీ, ఫిరోజ్, దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.
ఇక్కడే ఉంటాం : బుర్ర సంసోన్, ముగ్గురోడ్డు
మా తాత తండ్రుల నుంచి నివాసం ఉంటున్నాం. ఇక్కడే నివాసం ఉంటాం. రాజధానిలో ఇటీవల ఇచ్చిన ప్లాట్లు కోర్టు తీర్పులకు లోబడి ఉండాలని నిర్ధేశించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో స్పష్టంగా పేర్కొన్నారు. అక్కడకు వెళ్తే మౌలిక సౌకర్యాలు లేవు. పిల్లలకు చదువులు దూరమవుతాయి. పని చేసుకుంటేనే పూట గడిచేది. అక్కడకు వెళ్తే పని ప్రాంతాలు దూరమవుతాయి. ఇప్పుడు ఉంటున్న ఇళ్లకే పట్టాలివ్వాలి.










