
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - వీరవాసరం
ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ అధిక ధరలు, స్థానిక సమస్యలపై నిరసనల వారం నిర్వహిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. వీరవాసరం మండల విస్తృతస్థాయి సమావేశం బొర్రా ఆలమహరాజు అధ్యక్షతన యుటిఎఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు, అధిక ధరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారంరోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనకు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసనల వారం నిర్వహిస్తున్నామన్నారు. ఒకవైపు అడ్డూఅదుపూ లేకుండా ధరలు, మరోవైపు నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నాయని, అయినా బిజెపి ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందని విమర్శించారు. ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తూ అంబానీ, అదానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. ప్రజల జీవనోపాధిని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పనకు ఆలోచించకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే బిజెపి పనిగా ఉందన్నారు. మహిళలు, చిన్నారులపైనా అత్యాచారాలు, దాడులు పెరిగిపోతుంటే వాటిని అరికట్టి రక్షణ కల్పించలేని బిజెపి సిగ్గుపడాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలపై విపరీతమైన భారాలు వేస్తుంటే తిరగబడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, కేతా జ్యోతిబసు, యాళ్లబండి నారాయణమూర్తి, యాళ్లబండి మారియ్యనాయుడు, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, పాలా కోటేశ్వరరావు, గొట్టుముక్కల శ్యాంబాబు, జుత్తిగ సాంబియాంభ, అయినంపూడి బాబూరావు పాల్గొన్నారు.