Nov 11,2023 00:59

ఆందోళన చేపడుతున్న నాయకులు, విద్యార్థులు

ప్రజాశక్తి- పాడేరు: ఐసిడిఎస్‌లో ఉద్యోగాలను
స్థానిక ఆదివాసిలతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పాడేరు స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ధర్నా నిర్వహించారు. ముందుగా ఐటిడిఎ కార్యాలయం నుండి ర్యాలీ అనంతరం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల వివిధ ఉద్యోగాల భర్తీకి ఐసిడిఎస్‌ ద్వారా జారీ అయిన నోటిఫికేషన్‌ ప్రతులను వారు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.ప్రభుదాస్‌ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాలో స్థానిక ఆదివాసీలకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఐసిడిఎస్‌ ఈ నెల 4న జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌ 5వ షెడ్యూల్డ్‌ స్పూర్తికి పూర్తి విరుద్ధంగా వుందన్నారు. గురుకులం, ఏకలవ్య పాఠశాలలు, శిశు సంక్షేమశాఖ (ఐసిడిఎస్‌)లు భర్తీ చేస్తున్న మిషన్‌ వాత్సల్య 22 పోస్టులు కూడా ఒక్క స్థానిక ఆదివాసీలకు కేటాయించలేదన్నారు.. ఫలితంగా ఆదివాసీ నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ జారీచేసిన ఉద్యోగ నోటిఫికేషన్లో ఒక్క పోస్టు కూడా ఆదివాసీలకు కేటాయించలేక పోవడం దారుణమన్నారు. ఆదివాసులకు అన్యాయం చేసే ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి ఆదివాసీ నిరుద్యోగులకు జాబితాల్లో చేర్చి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. 5వ షెడ్యూల్డ్‌ క్లాజ్‌ - 2 ప్రకారం జి.ఓ 3 రిజర్వేషన్‌ చట్టబద్దతకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని గిరిజన సలహ మండలి తీర్మానం చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని గౌరవించడం లేదని విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఏ ప్రాంతంలో ఉపాధ్యాయుల బదిలీ సందర్భంగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులు, ఎసిటి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు సుమారు 600 పోస్టులు వివిధ కారణాలు చూపుతూ ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేశారన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ వుందని 107 స్కూల్స్‌ మూసివేసారని విమర్శించారు.
ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కృష్ణారావు మాట్లాడుతూ, వివిధ శాఖలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ పేర్లతో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. ఉద్యోగాలు లేక ఆదివాసీ యువత తీవ్రమైన మానసిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీ ఎవరి కోసం పని చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గిరిజన స్పెషల్‌ డిఎస్సీ 1495 గిరిజన సంక్షేమశాఖ టీచర్‌ పోస్టులు (అల్లూరి జిల్లాలో 611 పోస్టులు), 40వేల మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో 2.50 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. నోటిఫికేషన్‌ రద్దు చేసి ఆదివాసీ నిరుద్యోగులకు జాబితాల్లో చేర్చి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేసారు. అనంతరం ఐసిడిఎస్‌ పీడీ సూర్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, జిల్లా కార్యదర్శులు పాంగి చిన్నారావు, జీవన్‌, గిరిజన సంఘం నాయకులూ టి కృష్ణారావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులూ కార్తీక్‌ విద్యార్థులు, ఆదివాసీ నిరుద్యోగ యువత పాల్గొన్నారు.