నాలుగో రోజుకు కార్మికుల దీక్షలు
ప్రజాశక్తి -రంపచోడవరం : సత్యసాయి వాటర్ వర్కర్స్‌కు రావాల్సిన పదినెలల వేతన బకాయి వెంటనే చెల్లించాలని కోరుతూ రంపచోడవరం ఐటిడిఎ ఎదురుగా చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా సిఐటియు రంపచోడవరం జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజనులకు తాగునీరు అందిస్తున్న సత్యసాయి ట్రస్ట్ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పది నెలల వేతనాలు ఇవ్వకపోతే కార్మికుల కుటుంబాలతో ఎలా బతకాలో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా అనేక గ్రామాలలో తాగునీరు అందక ఇప్పటికే గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారని, సత్యసాయి వాటర్ వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించకపొతే, వారి విధులను బహిష్కరిస్తే అన్ని గిరిజన గ్రామాలలో నీటిఎద్దడి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వాటర్ వర్కర్స్ పది నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










