Nov 23,2022 23:55

నిరసన తెలుపుతున్న సత్యసాయి వాటర్‌ సప్లై కార్మికులు

ప్రజాశక్తి మారేడుమిల్లి
మండలం సున్నంపాడు పంచాయతీ పరిధిలో సత్య సాయిబాబా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై కార్మికులకు 10 నెలల బకాయిలు జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వాణిశ్రీ, పల్లపు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. సత్యసాయి జయంతి సందర్భంగా బుధవారం పంపుహౌస్‌ వద్ద కార్మికుల ఆధ్వర్యాన సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వాణిశ్రీ, వెంకట్‌ మాట్లాడుతూ పది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రావలసిన అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వట్టి మాటలతో కాలం గడుపుతుందని మండిపడ్డారు. ఈ జీతాల విషయమై పలుమార్లు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారిని కలిసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మికి పలుమార్లు కార్మికులు వారి గోడువేలబుచ్చినా ఇసుమంత కనికరం లేకుండా ఉన్నారన్నారు. జీతాలు చెల్లించాలని ఈ నెల 24వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామన్నారు.