ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ :సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి కార్మికులకు జీతాలు అందించేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని సత్యసాయినీటి సరఫరా విభాగం కార్మికులు విన్నవించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక లక్ష్మీచెన్నకేశవపురం వద్ద ఉన్న సత్యసాయి పంప్ హౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి నీటి పథకాన్ని నమ్ముకుని జిల్లా జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు ఉన్నారన్నారు. అలాగే సత్యసాయి నీరు 10 నియోజకవర్గాల ప్రజలు వినియోగిస్తున్నారన్నారు. వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, కావున ప్రభుత్వం సత్యసాయి ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి, ప్రజలకు సకాలంలో నీరందించేలా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు రామచంద్ర, రాజేంద్రరెడ్డి, నారాయణ, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.










