ప్రజాశక్తి - రంపచోడవరం
5 మండలాల్లో గిరిజనులకు మంచి నీరు అందించే సత్య సాయి వాటర్ స్కీమ్‌లో పని చేస్తున్న కార్మికులకు తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఐటిడిఎ ఎదుట చేస్తున్న ఆందోళన శిబిరాన్ని సోమవారం ఎమ్మెల్సీ ఐవి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టరు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఐటీడీఎ అధికారులు నిర్లక్ష్యం ఫలితంగా వేతనాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉందన్నారు. లోపాలు వున్న కాంట్రాక్టర్‌కు ఎలా టెండర్ ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి టెండర్లు ఇవ్వడం వల్ల కార్మికులు జీతాలు లేక వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నా స్పందించక పోవడం దుర్మార్గమన్నారు. అనంతరం ఐటీడీఎ పివో సూరజ్ గనోరేతో కార్మికులను తీసుకుని వెళ్లి మాట్లాడారు. జడ్పీ సీఈఓతో కూడా మాట్లాడారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వై.విల్సన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు, మండల అధ్యక్షులు సనాతన బాబు, మండల ప్రధాన కార్యదర్శి వెంగలరావు, కార్యదర్శులు టాస్టైల్ బాబు, అనిల్ బాబు తదితరులు ఎమ్మెల్సీ ఐవి చేతుల మీదుగా రూ.6,870 కార్మికుల దీక్ష శిభిరానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ, ప్రధాన కార్యదర్శి వెంకట్, సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు.










