Nov 11,2023 22:03

పుట్టపర్తి భద్రతా ఏర్పాట్లపై పరిశీలన చేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

         పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్య సాయిబాబా 98 జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌లు రానున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన, భద్రత ఏర్పాట్లపై ఎస్పీ మాధవరెడ్డి పోలీసు, ఇతర శాఖల అధికారులు, ట్రస్టు సభ్యులతో శనివారం నాడు సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, ఆర్డీవో భాగ్యరేఖ, అదనపు ఎస్పీ విష్ణు, డీఎస్పీ వాసుదేవన్‌ ఏఆర్‌ డీఎస్పీ విజరు కుమార్‌ తదితరులతో కలిసి ప్రశాంతి నిలయం, పుట్టపర్తి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జయంతి వేడుకలకు కట్టుదిట్టమైన పోలీస్‌ భద్రత ఏర్పాటు చేసేలా అన్ని శాఖల అధికారులతోనూ మాట్లాడారు. రాష్ట్రపతి, గవర్నర్‌ పర్యటన సందర్భంగా పుట్టపర్తి పట్టణంలో ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలన్న వాటిపై ఆర్డీవో ఇతర శాఖల అధికారులతో చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేసేందుకు భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ప్రణాళిక బద్ధంగా చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పోలీసు సిబ్బందికి తెలియజేశారు. వివిఐపిలు, విఐపిలు ఉండే గణేష్‌ గేట్‌ గోపురం, వెస్ట్‌గేట్‌, శాంతిభవన్‌, సాయి కుల్వంత్‌, భోజన సముదాయాల శిబిరాలు, ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చేపట్టాలన్నారు. ఈనెల 18 నుంచి 24 వరకు జరిగే శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ముగిసేంత వరకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి సిఐ రవీంద్రారెడ్డి, పట్టణ సిఐ కొండారెడ్డి, ఆర్‌ఐ టైటాస్‌, ఎస్‌ఐ సురేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.