Nov 07,2023 21:34

బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాల పునర్విభజన సందర్భంగా పుట్టపర్తి కేంద్రంగా సత్య సాయి జిల్లాను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఓ వరం లాంటిదని పుట్టపర్తి శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తిలో మంగళవారం నిర్వహించిన రైతుభరోసా పంపిణీ కార్యక్రమం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో కరువు కోరల్లో చిక్కుకుని అలమటించిన ఈ ప్రాంత ప్రజలకు గత ప్రభుత్వాలు ఏమీ చేయలేక పోయాయని తెలిపారు. వైఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ కరువు రాలేదన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా ముఖ్యమంత్రి సాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న రైతు భరోసా నిధులు పంట పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏటా కరువు కమ్మేసిందన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్‌ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడానికి ప్రత్యేక జీవో జగన్‌ ఇచ్చారన్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారులు నాలుగు లైన్ల రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. పుట్టపర్తి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడడంతో ఇక్కడ స్థానికులకు ఉపాధి లభిస్తోందన్నారు. నియోజకవర్గంలో 31 రహదారుల మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి రూ.35 కోట్లను రహదారుల మరమ్మతులకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.