Oct 02,2021 06:39

గాంధీజీ హత్యకు పన్నిన కుట్రలో భాగస్వామ్యం ఉన్న సావర్కర్‌ విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించినప్పుడే గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన నమ్మిన, ఆచరించిన విలువలను భూస్థాపితం చేయడమే తన లక్ష్యం అని మోడీ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. తన మత విద్వేష రాజకీయాలతో నిత్యం దేశాన్ని అగ్నిగుండంలా మార్చింది. అన్నదమ్ముల్లా మెలగవలసిన వివిధ మతాల ప్రజల మధ్య శతృత్వాన్ని సృష్టించింది.

    నేడు మహాత్మా గాంధీ 152వ జయంతి. నిత్య జీవితంలో గాంధేయవాదులుగా జీవించిన వారి తరం దాదాపు కనుమరుగై పోయింది. గాంధీ వారసులమని, దేశానికి తామే స్వాతంత్య్రం తెచ్చిపెట్టామని చెప్పుకుని అధికార పీఠాన్ని దశాబ్దాలపాటు అంటిపెట్టుకున్న భారత జాతీయ కాంగ్రెస్‌ ఇప్పుడు తన రాజకీయ అస్థిత్వం కోసం తీవ్రంగా పెనుగులాడుతోంది. గాంధీయిజాన్ని ఆసాంతం ద్వేషించడమే గాక ఆ మహానేతను కాల్చి చంపి, సంబరాలు కూడా చేసుకున్న హిందూత్వ- ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో నడిచే పార్టీ అధికారాన్ని చెలాయిస్తోంది. జాతీయోద్యమంలో ఏనాడూ పాల్గొనని ఆ కూటమి ఇప్పుడు ఒక కుట్రపూరితమైన పద్ధతిలో ఆ జాతీయోద్యమ వారసత్వంగా మనకు సంక్రమించిన రాజ్యాంగపు లౌకిక వారసత్వాన్ని ధ్వంసం చేస్తోంది. ఆ జాతీయోద్యమం యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేకతను పూర్తిగా విడిచిపెట్టడమే కాకుండా, ప్రపంచానికే శత్రువుగా దాపురించిన అమెరికాకు మన దేశాన్ని ఒక తైనాతీగా దిగజార్చే పనిలో ఇప్పుడు బిజెపి, మోడీ తలమునకలై వున్నారు.
    సైద్ధాంతికంగా గాని, ఎత్తుగడల రీత్యా గాని మహాత్ముడితో కొన్ని విషయాలలో ఏకీభావం లేకపోయినప్పటికీ, కమ్యూనిస్టులు ఆనాడు జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌తో కలిసి పని చేశారు. అలా కలిసి పని చేయడానికి (1) సామ్రాజ్యవాద వ్యతిరేకత, (2) లౌకిక విధానం, (3) స్వావలంబన, (4) సామాజిక న్యాయం, (5) ప్రజాస్వామ్యం...వంటి అంశాలు ప్రాతిపదికగా ఉన్నాయి. నేటికీ ఈ అంశాల ప్రాధాన్యత కొనసాగు తోంది. నిజం చెప్పాలంటే వాటి ప్రాధాన్యత మరింత పెరిగింది కూడా. ఈ అంశాలపై బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ సాగిస్తున్న దాడిని తిప్పికొట్టి ఆ విలువలను కాపాడుకోవడంలో కమ్యూనిస్టులు ముందుండాలి. మరో మాటలో చెప్పాలంటే ఆ నాటి జాతీయోద్యమ వారసత్వాన్ని నిలబెట్టే కృషిలో ముందుండాలి.
    దేశ స్వాతంత్య్రపు 'అమృతోత్సవాలను' ఒకవైపు జరుపుతున్నట్టు ఆర్భాటం చేస్తూ అదే సమయంలో జాతీయోద్యమంలో ఒక ప్రధాన ఘట్టానికి నెలవైన జలియన్‌వాలాబాగ్‌ రూపురేఖలను సమూలంగా మార్చివేసింది మోడీ ప్రభుత్వం. దేశ భక్తి గురించి మాటలు గొప్పగా చెప్పే మోడీ మన సార్వ భౌమాధికారానికి చేటు తెచ్చే విధంగా అమెరికా ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గుతున్నారు. మన విదేశాంగ విధానంలో స్వతంత్రత మచ్చుకు కూడా కానరావడంలేదు.
     నేడు దేశం యావత్తూ గాంధీజీకి నివాళులు అర్పిస్తుంది. అందరికన్నా ఎక్కువ హడావుడి మోడీ ప్రభుత్వం చేస్తుందనడంలో సందేహం లేదు. కాని అదే రోజు గాంధీజీ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన భారతీయ రైతు రాజధాని సరిహద్దుల్లో నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో తన ఆందోళన కొనసాగిస్తున్న వైనం మనందరి ముందుంది. ఈ దేశం యొక్క ఆహార భద్రతను, వ్యవసాయ రంగంలో స్వావలంబనను పరిరక్షించే కృషిలో ఆ రైతులంతా ఉన్నారు. ఆ విధంగా వారంతా గాంధీజీ ఆశయాలను కాపాడే పోరాటం లో నిమగమై ఉన్నారు. దానికి పూర్తి వ్యతిరేక దిశలో, ఆ రైతుల పోరాటాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే పనిలో కేంద్ర ప్రభుత్వం తలమునకలై వుంది. చిన్న రైతు వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్యానికి పునాది. ఆ చిన్న రైతు మనుగడకే ముప్పు తెస్తూ మరోవైపు గాంధీకి నివాళి అర్పించే కపటనాటకం బిజెపిది.
     తమ కపట నాటకం బైటపడకుండా ఉండేటందుకు తాజాగా హిందూత్వ శక్తులు కొత్త ఎత్తు వేశాయి. ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య అమెరికన్‌ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ అమెజాన్‌ ను తీవ్రంగా విమర్శిస్తూ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ-2 గా దానిని అభివర్ణించింది. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఉన్నట్టుండి మళ్ళీ 'స్వదేశీ' నినాదాన్ని తలకెత్తుకుంది (అంతకు కొద్ది రోజుల ముందే పాంచజన్య ఇన్ఫోసిస్‌ సంస్థ దేశద్రోహానికి పాల్పడుతున్నట్టు తీవ్రంగా విమర్శించింది.). మోడీ చేసిన వ్యవసాయ చట్టాలు గనుక అమలు లోకి వస్తే మన దేశం త్వరలో విదేశాల ముందు చిప్ప పట్టుకుని ఆహారధాన్యాల కోసం దేబిరించే దుస్థితి దాపురించడం ఖాయం. ఆహార స్వావలంబన దెబ్బ తిన్నాక ఇక మన స్వాతంత్య్రానికి విలువే ముం టుంది? కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం చేస్తున్నా దాని గురించి పల్లెత్తు మాట అనని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ గాని పాంచజన్య గాని ఉన్నట్టుండి దేశభక్తి మంత్రం పఠించడం కన్నా మోసం ఇంకొకటి ఉంటుందా?
     ఆర్‌ఎస్‌ఎస్‌ పఠించేది స్వదేశీ మంత్రం, చెప్పేది దేశభక్తి గురించి. కాని ఆ సంస్థ చెప్పే ''హిందూత్వ'' ఆర్య జాతి ఆధిక్యత గురించి తప్పుడు వాదనలు చేసిన హిట్లర్‌ ఫాసిస్టు సిద్ధాంతం నుంచి ఎరువు తీసుకున్నదే. ఆచరణ లో కూడా అమెరికాకు అడుగుకు మడుగులొత్తే విధాన మే. ఆర్థిక విధానాలన్నీ విదేశీ బహుళజాతి సంస్థలకు మన దేశాన్ని అప్పజెప్పే విధానాలే. చివరకు దేశ రక్షణ విషయంలో కూడా ద్రోహం చేయడానికి మోడీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. స్వయానా దేశ ప్రధాని రంగం లోకి దిగి కుదుర్చుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన కుంభకోణం మీద ప్రస్తుతం ఫ్రెంచి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఆనాడు గాంధీజీ దేశ ప్రజానీకాన్నంతటినీ కదిలించి ఉద్యమోన్ముఖుల్ని చేయడానికి ఇచ్చిన స్వదేశీ నినాదాన్ని ఈ నాడు తప్పు దోవ పట్టిస్తోంది సంఘపరివారం.
     అంటరానితనాన్ని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ తో గాంధీజీకి కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, దళితులపై సాగుతున్న వివక్షత నిర్మూలించబడాలని గాంధీజీ కోరుకున్నారు. మరి గాంధీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తున్న మోడీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? మనువాదాన్ని నిస్సిగ్గుగా మళ్ళీ తెర పైకి తెస్తోంది. దళిత, గిరిజన, పేద విద్యార్థు లలో అత్యధిక శాతాన్ని ప్రామాణికమైన చదువుకు దూరం చేసి శాశ్వతంగా ఆ తరగతుల ప్రజల ను వెనుక బాటుతనం లోనే మగ్గిపోయేలా నూతన విద్యా విధానాన్ని తెచ్చింది. ఇంకోవైపు ప్రభుత్వ రంగం అన్నదే లేకుండా సమస్తాన్నీ ప్రైవేటీకరించి ఉద్యోగాలలో రిజర్వే షన్ల అమలుకు ఆస్కారం లేని పరిస్థితి తెచ్చింది. వ్యవసాయ చట్టాలు దళితులకు, పేదలకు భూమిపై హక్కును పోగొట్టి కార్పొరేట్‌ పరం కావడానికి బాటలు వేస్తున్నాయి. అంటే, అటు భూమీ లేక, ఇటు చదువూ లేక, మరో పక్క ఉద్యోగాలూ లేక దళితులు, గిరిజనులు ఏమైపోవాలి? ఇంత అన్యాయం చేస్తూనే అటు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కు, ఇటు గాంధీజీకి చాలా 'భక్తి శ్రద్ధలతో' నివాళులర్పించే డ్రామా ఆడడం మోడీకే చెల్లింది.
     సత్యం తన జీవిత విధానం అని గాంధీజీ ప్రకటించారు. తొలుత ''దైవమే సత్యం'' అన్న గాంధీజీ తర్వాత ''సత్యమే దైవం'' అని ప్రకటించారు. సత్యమేవ జయతే అన్న నినాదం ఆ విధంగానే వచ్చింది. కాని ఇప్పుడు మోడీ ప్రభుత్వం గాని, ఆరెస్సెస్‌ గాని సత్యానికి వీసమెత్తు విలువ ఇవ్వడం లేదు. జాతీయోద్యమానికి సంబంధించి, మన దేశ చరిత్రకు సంబంధించిన సత్యాలను నిలువెత్తు గోతిలో పాతర వేయాలని ప్రయత్నిస్తున్నారు. పేదరికం పెరిగిందని దేశ గణాంకాలు వెల్లడిస్తే వాటిని వెలుగులోకి రాకుండా ఆదేశించి సత్యాన్ని కప్పిపుచ్చడానికి చూస్తున్నారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారిపై అబద్ధపు కేసులు బనాయించి జైళ్ళలో కుక్కుతున్నారు. కరోనా మరణాలెన్ని సంభవించాయో చెప్పకుండా తప్పుడు లెక్కలను ప్రకటిస్తున్నారు. పి.ఎం కేర్స్‌ నిధుల విషయంలో సత్యం ఏమిటో తెలుసుకునే అధికారం ప్రజలకు లేదని బాహాటంగానే ప్రకటించారు. రాఫెల్‌ కుంభకోణం ఆరోపణల్లో సత్యం ఏమిటో తెలుసుకోడానికి వీలు లేకుం డా, పార్లమెంటరీ దర్యాప్తుకు అంగీకరించకుండా కప్పిపు చ్చారు. ఎలక్టొరల్‌ బాండ్ల ద్వారా నిధులను బిజెపి కి అత్యధి ¸కంగా ఇస్తున్న ఆ అదృశ్య శక్తులెవరో తెలిసే వీలు లేకుండా సత్యానికి ముసుగు వేశారు. గాంధీజీ తన జీవితంలో నైతిక ప్రవర్తనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కాని, మోడీ పాలన నైతిక విలువలకు పాతర వేసింది. ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను బాహాటంగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యంలో పాటించవలసిన కనీసపు నైతిక విలువల ను కూడా కానరాకుండా చేసింది. పెగాసస్‌ కుంభకోణం మోడీ ప్రభుత్వ అనైతిక విధానాలకు ఒక ఉదాహరణ.
    గాంధీజీ హత్యకు పన్నిన కుట్రలో భాగస్వామ్యం ఉన్న సావర్కర్‌ విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించినప్పుడే గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన నమ్మిన, ఆచరించిన విలువలను భూస్థాపితం చేయడమే తన లక్ష్యం అని మోడీ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. తన మత విద్వేష రాజకీయాలతో నిత్యం దేశాన్ని అగ్నిగుండంలా మార్చింది. అన్నదమ్ముల్లా మెలగవలసిన వివిధ మతాల ప్రజల మధ్య శతృత్వాన్ని సృష్టించింది. నేటికీ గాంధీజీ చెప్పిన, పాటించిన విలువలు చాలా ప్రాముఖ్యతను కలిగివున్నాయి. మోడీ ప్రభుత్వం, హిందూత్వ-సంఘ పరివార్‌ శక్తులు ఆ విలువలకు ద్రోహం చేస్తున్నాయి. అదే సమయంలో తమ ద్రోహం బైటకు కనిపించకుండా గాంధీ, అంబేద్కర్‌, పటేల్‌, తదితర జాతీయోద్యమ నాయకుల పట్ల దొంగ భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తున్నాయి. జాతీయోద్యమ లక్ష్యాలైన స్వావలంబన, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత వంటి అంశాలను ఈ సంఘ పరివారం కుట్రల నుండి కాపాడుకోవడం నూతన వ్యవస్థను నిర్మించాలనే ఆశయ సాధనలో అంతర్భా గమే. ఆ కృషిలో మనతోపాటు కలిసి నడిచేందుకు కోట్లాది మంది రైతులు, కార్మికులు, దళిత, బలహీన వర్గాలు, దేశభక్తులు ఎందరో సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కలుపుకుని ముందుకు సాగిపోవడమే గాంధీజీ కి నిజమైన నివాళి.
సత్యమేవ జయతే.

ఎం.వి.ఎస్‌. శర్మ

ఎం.వి.ఎస్‌. శర్మ