Feb 16,2021 06:45

ఆన్‌లైన్‌ మీడియా పోర్టల్‌ 'న్యూస్‌క్లిక్‌' సంపాదకులు, యజమాని ప్రబీర్‌ పుర్కాయస్థ, గీతాహరిహరన్‌ సహా ఆ సంస్థ కార్యాలయం, జర్నలిస్టులు, అధికారుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాడులు గత మంగళవారం మొదలై నాలుగు రోజుల అనంతరం ఆదివారం అర్థరాత్రి దాటాక ముగిశాయి. సోదాలు జరుగుతున్నన్ని రోజులూ సంస్థ ఓనర్‌ను, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. వారి ఫోన్లను, సంస్థ దైనందిన కార్యక్రమాలు సాగకుండా అన్ని రకాల కమ్యూనికేషన్‌ పరికరాలను సీజ్‌ చేశారు. టెర్రరిస్టులు, దేశద్రోహులు, జాతి విద్రోహ శక్తులను విచారిస్తున్న విధంగా ఒక స్వతంత్ర మీడియా సంస్థ ప్రతినిధుల పట్ల ఇడి వ్యవహరించింది. న్యూస్‌క్లిక్‌పై ఇడి అంతగా తన దర్యాప్తును ఎక్కుపెట్టడానికి అది చెపుతున్న కారణం మనీ లాండరింగ్‌ వ్యవహారం. ఎప్పుడో కొన్ని మాసాల క్రితం ఢిల్లీ పోలీసులు నగదు అక్రమ లావాదేవీల ఆరోపణలపై నమోదు చేసిన ఒకానొక ఎఫ్‌ఐఆర్‌. దాదాపు రూ.30 కోట్లు న్యూస్‌క్లిక్‌కు చేరాయన్నది అభియోగం. కేవలం అనుమానం ఆధారంగా ఎమర్జెన్సీలో మాదిరిగా విరుచుపడి గంటల కొలదీ ఏకబిగిన న్యూస్‌క్లిక్‌ బాధ్యులను విచారించింది. ఇంత హడావిడి చేసి, కొన్ని మీడియా సంస్థలకు ఏవో సాక్ష్యాలు దొరికినట్లు లీకులిచ్చి, చివరాఖరుకు ఏం దొరికాయో కూడా అధికార ప్రకటన చేయలేదంటే కచ్చితంగా ఈ దాడి ప్రభుత్వ రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతుంది.


కార్పొరేట్‌ మీడియాలో సింహభాగం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నదశలో న్యూస్‌క్లిక్‌, వైర్‌ వంటి సంస్థలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను, అసమ్మతి గళాలను, నిరసన గొంతుకలను ప్రజలకు చేరవేస్తున్నాయి. ధైర్యంగా వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. తాను చెప్పిందే వేదం అదే నిజంగా చెలామణి కావాలనుకున్న మోడీ సర్కారుకు న్యూస్‌క్లిక్‌ వంటివి కంటగింపుగా మారాయన్న దుగ్ధతోనే పోలీస్‌, సిబిఐ, ఇడి, ఐటి, ఎన్‌ఐఎ వంటి సంస్థలను వాటిపై ఉసిగొల్పుతున్నాయన్నది దాచినా దాగని రహస్యం. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీలో భైఠాయించిన రైతుల గుండె చప్పుడును ప్రజలకు తెలియజేస్తున్నారన్న కక్షతో మొన్ననే మృణాల్‌పాండే, రాజ్‌దీప్‌ సర్దేశారు, సిద్దార్ధ వరదజరాజన్‌ వంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు. అంతలోనే న్యూస్‌క్లిప్‌పై పడ్డారు. స్వతంత్ర డిజిటల్‌ మీడియా న్యూస్‌క్లిక్‌ చేసిన నేరం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వ్యతిరేక ఆందోళనలను, ప్రస్తుత రైతుల ఉద్యమ వార్తలను విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయడమే. ప్రభుత్వ విధానాల వలన సమాజంలో పేదలకు జరుగుతున్న అన్యాయాలపై అధ్యయన నివేదికలు రూపొందించడం, తులనాత్మక విశ్లేషణలు చేయడమే. అది సహించలేకనే బిజెపి సర్కారు ఇడి దాడులకు పురమాయించిందన్నది యదార్ధం.


భారత రాజ్యాంగం పౌరులకు వాక్‌ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన హక్కును కల్పించింది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే హక్కులను కాలస్తే దిక్కెవరు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే అంగం బాధ్యతాయుతంగా ప్రభావవంతంగా పని చేసినప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. విమర్శనాత్మక జర్నలిజాన్ని మోడీ ప్రభుత్వం నిలువరించాలనుకుంటోంది. సర్కారీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసినా, రాసినా దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఫెమా వంటి తీవ్రాతి తీవ్రమైన కేసులను అక్రమంగా బనాయిస్తోంది. కక్షపూరితంగా, వేధింపులకు పాల్పడి భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తోంది. ఢిల్లీ రైతుల ఉద్యమానికి ట్విట్టర్‌లో సంఘీభావం ప్రకటించిన 21 ఏళ్ల దిశా రవి అనే పర్యావరణ కార్యకర్తను హుటాహుటిన ఆదివారం బెంగళూరు నుంచి ఢిల్లీకి తరలించి అరెస్టు చేశారు. ఇలాగే రైటర్లు, కమెడియన్లు, కార్టూనిస్టులు, సోషల్‌ యాక్టివిస్టులపై మోడీ సర్కారు అక్రమ కేసులు పెడుతోంది. మరోవైపు అర్ణబ్‌ గోస్వామి లాంటి వారి కొమ్ము కాస్తోంది. న్యూస్‌క్లిక్‌పై ప్రభుత్వ ప్రేరేపిత దాడి మీడియా స్వతంత్రతపై దాడి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం హననం. మోడీ ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. ఇప్పుడు కూడానాజీల నాటి జర్మనీ నానుడి వలే మనం కాదు కదా అనుకుంటే మన వంతు రావడానికి ఎంతో సమయం పట్టదు.