వజ్రపుకొత్తూరు: జీడి రైతుల సత్యాగ్రహ దీక్ష పాలకులకు కనువిప్పు కలగాలని ఎపి జీడి రైతు సంఘం కన్వీనర్ తెప్పల అజరుకుమార్ అన్నారు. మండలంలోని వంకులూరులో మెట్టూరు ఎంపిటిసి కొందప్ప సురేఖ చేతుల మీదుగా 24 గంటల జీడి రైతుల సత్యాగ్రహ దీక్ష పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కాశీబుగ్గ బస్టాండ్ పరిధిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సత్యగ్రహ దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని పట్టభద్రుల పూర్వ ఎమ్మెల్సీ ఎన్.వి.ఎస్.శర్మ ప్రారంభిస్తారని అన్నారు. ఉద్దానం జీడి రైతాంగం ప్రజలు, ఇతర పంటల పండించే రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి జీడి రైతులకు సరైన ధర ఇవ్వక వ్యాపారులు మోసం చేస్తున్నారని అన్నారు. కానీ, పాలకులు జీడి రైతులకు రక్షణ కల్పించలేదని విమర్శించారు. నాలుగేళ్లుగా జీడి పిక్కల ధర వంద శాతం దిగజారడంతో రైతులకు గిట్టుబాటు రావడం లేదని అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడే హీనస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలనని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జీడి పంటను గుర్తించి పంటల జాబితాలో చేరిపించాలన్నారు. 80 కిలోల జీడి పిక్కల బస్తకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జీడి రైతు సైని సింహాచలం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.










