Feb 06,2023 00:02

పుష్కరిణిలో చెత్తా చెదారం అ

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలో ఉపమాక పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరిస్తే పుణ్యం మాట దేవుడెరుగు అంటువ్యాధులు ప్రబలడం ఖాయం. ప్రాచీన పుణ్య క్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి బంధర సరస్సు అంటే ఒక పవిత్రమైన పుష్కరిణి. పుష్కరిణిలో కాళ్ళు కడుక్కుని, నెత్తిపై కొన్ని జలాలు జల్లుకుంటే సకల పాపాలు హరిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. గతంలో పుష్కరిణి చాలా ఆహ్లాదకరంగా దర్శినమిచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. నాచు మొక్కలు, గడ్డి, ఇతర వ్యర్ధాలు, ప్లాస్టిక్‌, చెత్త గుడ్డలతో నిండి, నీరంతా కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. గతంలో స్వచ్ఛమైన నీటితో నిండుకుండలా దర్శినమిచ్చిన పుష్కరిణి నేడు వ్యర్థాలతో నిండి ఆధ్వానంగా ఉండటంతో భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. సుదూరు ప్రాంతాల నుండి వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి, స్వామిని దర్శించుకుంటారు. గ్రామస్తులు కూడా చెరువులో స్నానాలు ఆచరించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెరువులలో కాలు పెడితే రోగాలు అంటుకునేలా వుంది. ఉపమాక వెంకన్న ఆలయాన్ని మరింతగా అభివృద్ధి పరచడానికి 2015 నవంబర్‌ 18న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేసారు. టిటిడి అధికారులు ఆలయాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత రెండు, మూడేళ్ల వరకు స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు, సేవలు, ఇతర కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో టిటిడి మార్కు కనిపించింది. భక్తులతో పాటు గ్రామస్తులు ఉపమాక వెంకన్న ఆలయం అభివృద్ధి చెందుతుందని భావించారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై టిటిడి అధికారులు శీతకన్ను వేసారు. ముఖ్యంగా పుష్కరిణి అభివృద్ధిపై దృష్టి సారించలేదు. పుష్కరిణిలో కలుషితమైన నీరు, వ్యర్ధాలను తొలిగించకుండానే పుష్కరిణి చుట్టూ లక్షలాది రూపాయులు వ్యయంతో రాతి కట్టడాలు చేపట్టి , ఐరన్‌ గ్రిల్స్‌ మాత్రం ఏర్పాటు చేసారు. చెరువులో ఉన్న కలుషిత నీరు తొలగించాలని స్థానికులు చెప్పినప్పటికీ, టిటిడి అధికారులు పెడచెవిన పెట్టారు. స్వామి వారి వార్షిక కల్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల్లో చాలా మంది పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. మూడేళ్ల నుంచి చెరువు అధ్వానం గా ఉండటంతో భక్తులు స్నానాలు ఆచరించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే భక్తులు, గ్రామ పెద్దలు, అఖిల పక్ష పార్టీల నేతలు చెరువు శుభ్రం చేయాలని కోరుతూ టిటిడి అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా పుష్కరిణి సమస్య పై టిటిడి అధికారులకు చెప్పారు. టిటిడి అధికారులు చెరువును గాలికొదిలేసారు. స్వామి వార్షిక కల్యాణ్సవాలు సమీపిస్తున్నాయి. మార్చి 2వ తేదీ నుండి స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి.చెరువు చూస్తే చాలా అఫరిశుభ్రంగా ఉండి, కనీసం కాలు పెట్టలేని స్థితిలో ఉంది. సబంధిత అధికారుల్లో చలనం మాత్రం కనిపించలేదు. ఇప్పటి వరుకు చెరువు పరిశుభ్రతపై పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్పందించి చెరువును పరిశుభ్రం చేయించాలని భక్తులు కోరుతున్నారు.