ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొర్ర త్రినాధ్ అధ్యక్షతన శనివారం గ్రామసభను నిర్వహించారు. తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి హామీ, పారిశుధ్యం వివిధ అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోర్ర త్రినాధ్ మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా పంచాయతీ పరిధిలో 14 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకాల పనులు ప్రారంభమయ్య యన్నారు. మిగిలిన 10 గ్రామాల్లో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడానికి కృషి చేయాలని పంచాయతీ సచివాలయ సిబ్బందికి సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ కేంద్ర భవనాలు మంజూరు చేయాలని గ్రామ సభలో తీర్మానించి ప్రతిపాదనలో పెట్టాలని సర్పంచ్ అధికారులను కోరారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో పలుచోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంకు రాష్ట్ర ప్రభుత్వం చాటు మార్గాన్న గ్రామాలలో సభలు నిర్వహించకుండా ప్రతిపాదనలు చేయడంపై సర్పంచ్ అసహనం వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సభలో పంచాయతీ విస్తరణ అధికారి చిన్న, డీడీఓ సోమేశ్వరరావు, ఉప సర్పంచ్ అర్లబు సత్యం, సెక్రెటరీ ప్రశాంత్, డిఎ దేవేంద్రుడు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.










