Nov 06,2023 21:07

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎఎస్‌పి దిలీప్‌కిరణ్‌

పార్వతీపురం : అర్జీదారులు అందజేసిన వినతులను సత్వరమే పరిష్కరించాలని సంయుక్త కలక్టరు ఆర్‌. గోవిందరావు జిల్లా అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని సమస్యలు ఉంటే ఏ కారణం చేత పరిష్కారం కావో తెలియజేయాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఐటిడిఎ పిఒ సి.విష్టుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు కూడా వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 150 వినతులు అందజేశారు. పింఛన్ల కోసం, కరువు నుంచి రైతులను ఆదుకోవాలని, ఇతర సామాజిక సమస్యలపై ఎక్కువ వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్‌పి స్పందనకు ఆరు ఫిర్యాదులు
పార్వతీపురంరూరల్‌ : స్థానిక జిల్లా పోలీసుకార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన (గ్రీవెన్సు డే ) కార్యక్రమానికి ఆరు ఫిర్యాదులు అందాయి. ఎఎస్‌పి డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బి సిఐ, సిహెచ్‌ లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకర్‌ రావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
స్పందనకు 62 వినతులు
సీతంపేట : స్థానిక ఐటిడిఎలో స్పందన కార్యక్రమం సోమవారం పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ స్పందనకు 62 వినతులు వచ్చాయి. వీటిలో కడగండి గ్రామానికి చెందిన మల్లేశ్వరరావు విద్యుత్‌ స్తంభాలు మార్చాలని, జోనగా గ్రామానికి చెందిన కుమారి కుట్టు మిషన్‌ ఇప్పించాలని, జజ్జువకు చెందిన బాలేసు పవర్‌ లీడర్‌ మంజూరు చేయాలని వినతులు ఇచ్చారు. గదవ వలసకు చెందిన రాజకుమార్‌ మైక్‌ సెట్‌ లోన్‌ ఇప్పించాలని, సంఖిలీకి చెందిన అబ్బాయి సిసి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. కన్నపురానికి చెందిన శ్రీనివాసరావు తాగునీటి సమస్య పరిష్కరించాలని, సవర గోయది గ్రామానికి చెందిన రవి పంపు బారు ఉద్యోగం ఇప్పించాలని, ఇరపాడు గ్రామానికి చెందిన జయమ్మ మేకల లోను ఇప్పించాలని కోరారు. చింతపండు తమానుగూడ చెందిన దుర్గారావు కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని, పొంజాడకు చెందిన సుబ్బారావు భాషా వాలంటరీ పోస్ట్‌ ఇప్పించాలని వినతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రోషి రెడ్డి, డ్రైవింగ్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సింహాచలం, డిడి మంగవేణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, డిప్యూటీ డిఇఒ లిల్లీ రాణి, ఎడిఇ భీమరాజు, డిఇ కృష్ణ కుమార్‌, పిహెచ్‌ఒ గణేష్‌, పిఎఒ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.