Jul 13,2023 00:04

విలేకర్లతో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగింపునకు నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రామారావు డిమాండ్‌ చేశారు. పెందనందిపాడుకు బుధవారం వచ్చిన ఆయన స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడార. 50 గ్రామాలకు తాగునీరు, 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ గుంటూరు ఛానల్‌ పొడిగింపు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఈ ప్రాంత రైతులు, ప్రజలు దీనికోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాల హామీలతో సరిపెడుతున్నాయేగాని ఆచరణకు మాత్రం పూనుకోవడం లేదని విమర్శించారు. నేటి ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో రైతులు కేవలం వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, అతివృష్టి, అనావృష్టితో నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నల్లమడ వాగులోని కలుషితమైన నీరు సాగుకు వాడటం వల్ల పొలాలు చౌడువారిపోతున్నాయని చెప్పారు. పలు గ్రామాల్లో తాగునీటికి, వాడుకోవడం కోసం నీరు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గుంటూరు ఛానల్‌ను పొడిగించడం అత్యవసరమని చెప్పారు. గుంటూరు ఛానల్‌ సాధన సమితి నాయకులు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును, ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ను, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లను కలసి ఈ ప్రాంత రైతుల సమస్యలను వివరించారని, వారు సానుకూలంగా స్పందించినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. గుంటూరులో నల్లమడ రైతుసంఘం ఆధ్వర్యంలో 14 రోజుల నుంచి రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఈ విషయంలో రైతులకు సిపిఎం తన పూర్తి మద్దతు తెలియజేస్తోందని ఉద్ఘాటించారు. జగన్‌ పాదయాత్రలోనే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులు పూర్తి చేస్తామనే హామీనిచ్చారని గుర్తు చేశారు. సిఎం తన హామీని నెరవేర్చకుంటే భవిష్యత్తులో అన్ని పార్టీలు, రైతు సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేసేందుకు సిపిఎం సిద్ధమవుతోందన్నారు. సమావేశంలో గుంటూరు ఛానల్‌ సాధన సమితి నాయకులు ఎన్‌.ఆచార్యులు. సిపిఎం నాయకులు కె.నాగేశ్వరావు, కె.వెంకట సుబ్బారావు. సిహెచ్‌.యానాదులు, డి.శ్రీనివాసరావు, కె.బాబు పాల్గొన్నారు.