Aug 29,2021 08:46

చిరుధాన్యాల్లో జన్నలు ఒకటి. శరీరానికి ఎన్నో పోషకాలు అందించే వీటితో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వెరైటీగా చేస్తే పిల్లలూ ఎంతగానో ఇష్టంగా తింటారు. మరి జన్నలతో ఎలాంటి వెరైటీలు చేయొచ్చు? వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..!
తీపి తాళికలు
తీపి తాళికలు
కావాల్సిన పదార్థాలు : జన్న పిండి - 200 గ్రా, గోధుమ పిండి - 50 గ్రా, పాలు - అర లీటరు, బెల్లం - 200 గ్రా, యాలకులు - 4.
తయారుచేసే విధానం:
- జన్నపిండి, గోధుమ పిండిని గోరు వెచ్చటి నీటితో కలిపి, ముద్దగా చేసుకోవాలి.
- ఆ ముద్దను పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
- తరిగిన బెల్లంలో కొద్దిగా నీళ్లు కలిపి, కరిగేంత వరకూ స్టౌ మీద ఉంచి దించాలి.
- పిండిని మురుకుల గొట్టంలో పెట్టి, తాళికల ఆకారంలో కాగుతున్న పాలలో వత్తాలి.
- అవి పాలలో ఉడికిన తర్వాత, బెల్లం పాకం పోసి, కలపాలి. అందులో యాలకుల పొడితో పాటు జీడిపప్పు, ఎండుద్రాక్షా వేసుకోవచ్చు.

స్పాంజ్ కేక్
స్పాంజ్ కేక్ : కావాల్సిన పదార్థాలు : జన్న పిండి - 115 గ్రా, డాల్డా / వెన్న - 80 గ్రా, చక్కెర పొడి - 115 గ్రా, బేకింగ్‌ పౌడర్‌ - అరస్పూన్‌, వెనీలా ఎసెన్స్‌ - కొన్ని చుక్కలు, కోడిగుడ్లు - 2.
తయారుచేసే విధానం:
- ముందుగా జన్నపిండిలో బేకింగ్‌ పౌడర్‌ వేసి, జల్లెడ పట్టాలి.
- వెన్న / డాల్డాలో పంచదార పొడిని కలుపుకుంటూ నురుగు వచ్చే వరకూ గిలకొట్టుకోవాలి.
- అదే విధంగా కోడిగుడ్డును సొన వేసి, గిలకొట్టుకోవాలి.
- గిలక్కొట్టిన డాల్డా / వెన్నలోకి గుడ్డును, వెనీలా ఎసెన్స్‌ వేసి, కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలోకి జన్నపిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ, అర్ధచక్రం దిశలో కలుపుకోవాలి. పూర్తి చక్రంలా కలుపుకుంటే కేకు గట్టిగా వస్తుంది.
- పిండి మిశ్రమం కొద్దిగా పల్చగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని కేకు తయారుచేసే పాత్రలో వేసుకోవాలి.
- పిండి గట్టిగా ఉన్నట్లనిపిస్తే పాలనూ, నీటిని కలుపుకొని కావాల్సిన విధంగా మార్చుకోవాలి.
- తర్వాత పాత్రని ఒవెన్‌లో పెట్టి 350 డిగ్రీల వద్ద 25 నిమిషాల వరకూ ఉంచాలి. అంతే కేక్‌ రెడీ.

నమక్‌ పారా     

నమక్‌ పారా
కావాల్సిన పదార్థాలు : జన్నపిండి - 250 గ్రా, జీలకర్ర - అరస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, నీళ్లు- తగినన్ని.
తయారుచేసే విధానం:
- జన్నపిండిలో ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. అందులో నీళ్లుపోసి ముద్దగా చేసుకోవాలి.
- ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేసుకోవాలి.
- తర్వాత కావాల్సిన ఆకారంలో చాకుతో చపాతీని ముక్కలుగా కోసుకోవాలి.
- వాటిని నూనెలో వేగించుకుని పేపర్‌ మీద కొద్దిసేపు గాలికి ఉంచాలి. అంతే నమక్‌పారా రెడీ.