సత్తెనపల్లి టౌన్: స్థానిక ఏరియా వైద్యశాలలో దంత సమస్యలతో బాధపడే రోగులకు సంపూర్ణ వైద్యం అందివ్వనున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో దంత సమస్యతో బాధపడే రోగులకు పుచ్చిపోయిన దంతాలను తీయడం, ఫిల్లింగ్ లాంటి సమస్యలకు మాత్రమే వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇరిగిన దంతాలు, వంకర దం తాలు సరి చేయడం, క్లిప్పులు వేయడం వంటి సౌకర్యాలు ఆసుపత్రిలో లేకపోవడం వలన ప్రజలు ప్రైవేట్ వైద్యశాలలకు వెళుతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులను గుర్తించిన మంత్రి అంబటి రాం బాబు ఆదేశాల మేరకు నేషనల్ ఒరాల్ హెల్త్ ప్రోగ్రాం కింద ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇకపై దంత సమస్యలతో బాధపడే రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు ఇక్కడ అందివ్వనున్నామని, డాక్టర్ జెఫ్రీ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్బంగా ఒప్పందపు పత్రాన్ని ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ లక్ష్మణావుకు అందజేశారు.










