
* అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
* టిడిపికి స్పీకర్ సీతారాం సవాల్
* ఒకే పాలనలో అనేక సంస్కరణలు
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - ఆమదాలవలస: 'మా పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి' అని చెప్పే ధైర్యం ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఆ సత్తా ఉందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా చంద్రయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైసిపి పాలనలో సంక్షేమ కార్యక్రమాలన్నీ అవినీతి లేకుండా జరిగాయన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదారులు బాగుపడితేనే అభివృద్ధి జరిగినట్లా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని టిడిపికి సవాల్ విసిరారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఒకే పాలనలో అనేక సంస్కరణలు
వైసిపి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడూ జిల్లా అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. నేరడి బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒడిశాపై కేసు గెలిచినా, ఒక మెట్టు దిగి ఒడిశా వెళ్లి సిఎం నవీన్ పట్నాయక్‌ను కలిసి సహకరించాలని కోరారని గుర్తుచేశారు. ఆయన స్పందించకపోవడంతో, హిరమండలం వద్ద రూ.800 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారని, ఈనెల 23న ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. ఒకే పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు అవినీతి లేకుండా భర్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. విశాఖపట్నంను రాజధానిగా జగన్మోహన్ రెడ్డి చేస్తామంటే, చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తన తాబేదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి రాజధానిగా నిర్ణయించారని ఆరోపించారు. విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలుగుదేశం నాయకులకు మాట్లాడడానికి ఏవీ లేక విద్యుత్, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెరిగాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు ప్రజల ఆత్మాభిమానాన్ని జన్మభూమి కమిటీల వద్ద తాకట్టు పెడితే, జగన్ ప్రభుత్వంలో ఇంటికే పథకాలు అందుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. మూలపేట పోర్టు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌కు సవాల్‌లు విసరడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వేస్టేషన్లలో స్టీల్ కుర్చీలు వేయించడం తప్ప జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు వి.కళావతి, రెడ్డి శాంతి, కంబాల జోగులు, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జూపూడి ప్రభాకరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు పేరాడ తిలక్, అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, దానేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వైసిపి నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించాల్సి ఉంది. స్థానిక నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద దండలు సిద్ధం చేసినా నాయకులు ఆగకుండా వెళ్లిపోవడంతో, ఇదేనా సామాజిక సాధికారిత యాత్ర అంటూ పలువురు వ్యంగంగా మాట్లాడుకున్నారు. బస్సు యాత్ర షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో నాడు-నేడుతో ఆధునీకరించిన మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శన రద్దయింది. సభలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతున్న సమయంలో మహిళలు, కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు. సినీ నటి, మంత్రి రోజా వస్తుందని చెప్పడంతో వచ్చామని, తీరా చూస్తే ఆమె రాలేదని పలువురు మహిళలు చెప్పారు. సభకు రాకపోతే పథకాలను నిలిపేస్తామని బెదిరించారని సరుబుజ్జిలి మండలం బప్పడాం, అమృత లింగనగరం తదితర గ్రామాల మహిళలు తెలిపారు. వచ్చాక కనీసం తాగడానికి మంచినీళ్ల ప్యాకెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
మరోసారి బట్టబయలైన గ్రూపుల గోల
సామాజిక సాధికారిక యాత్రలో వైసిపిలో గ్రూపుల గోల మరోసారి బయటపడింది. బస్సు యాత్రలో సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, కోట గోవిందరావు గానీ వారి అనుచరగణం గానీ పాల్గొనలేదు. చింతాడ రవికుమార్ కృష్ణాపురం జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో స్పీకర్ సీతారాం ఫొటోను వేయకుండా సిఎం, మంత్రులు, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి సుబ్బారెడ్డి తదితరుల ఫొటోలతో ముద్రించారు. దీంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలతోనే తొలగించారని రవికుమార్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీల తొలగింపుతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు పట్టణంలో నెలకొన్నాయి.
అవస్థలు పడిన ప్రజలు
సాధికార యాత్ర నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, ఇటువైపు కృష్ణాపురం జంక్షన్ వద్ద రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో పట్టణంలోకి బస్సులు, ఆటోలు, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వేస్టేషన్‌కు వచ్చి, వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పట్టణం నుంచి నరసన్నపేటకు వెళ్లే బస్సులు కృష్ణాపురం జంక్షన్ నుంచి రాకపోకలు సాగించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. హిరమండలం, కొత్తూరు వెళ్లే బస్సులు ఫ్లై ఓవర్, బొడ్డేపల్లిపేట, పార్వతీశంపేట మీదుగా దారిమళ్లించడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించి ఫ్లై ఓవర్ వద్దకు చేరుకుని బస్సులు ఎక్కారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి ఉదయం వెళ్లే ఉద్యోగులు బస్సులు పట్టణంలోకి రాకపోవడంతో సమాచారం తెలియక చాలాసేపు రైల్వేస్టేషన్ జంక్షన్, పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద బస్సుల కోసం వేచిచూశారు. చివరికి విషయం తెలియడంతో కొంతమంది పార్వతీశంపేట జంక్షన్, మరికొంతమంది ఫ్లైఓవర్ దగ్గరికి బస్సుల కోసం పరుగులు తీశారు. చాలామంది ప్రయాణికులు ఫ్లైఓవర్ దిగున బస్సులు దిగి రైల్వేస్టేషన్ వరకు నడుచుకొని రావడం కనిపించింది. పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు వైసిసి కార్యకర్తలను బస్సు యాత్రకు తరలించడం కోసం తీసుకోవడంతో చాలామంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇంటి వద్దనే ఉండిపోయారు. పాఠశాలలు కూడా ఒక పూట మాత్రమే పనిచేశాయి. నడిరోడ్డుపై సభలు నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పలువురు అసహనం వ్యక్తం చేశారు.