Nov 22,2020 12:29

      అనగనగా ఒక వేటగాడు అడవిలో వేటకు వెళ్లాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితేగానీ ఒక పాము, ముంగీస దొరకలేదు. వాటి రెండింటిని తీసుకొచ్చి ఒక బోనులో బంధించాడు. 'నేను ఈ రాత్రికి మిమ్మల్ని ఏమీ చెయ్యను. ఎందుకంటే మీరిద్దరూ బద్ధశత్రువులని నాకు తెలుసు. రాత్రికి ఎలాగూ పొట్లాడుకుంటారు. ఉదయానికి ఎవరో ఒకరే బతికి వుంటారు. రేపు ఉదయం బోను తెరిచి చూసేసరికి ఎవరు బతికి ఉంటారో వాళ్లనే కూర చేసుకొని తింటాను' అని బోను మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
     పాము, ముంగీస కాసేపు గుర్రుగా చూసుకున్నాయి. కొంత సమయం తర్వాత ఇలా మాట్లాడుకున్నాయి. 'మనం పోట్లాడుకుంటే రాత్రికి ఒకరు చనిపోవడం ఖాయం. బతికిన వారికీ రేపు వేటగాడి చేతిలో చావు తప్పదు. ఎలా చూసినా ఇద్దరం చనిపోతాం. కాబట్టి మనం ఉపాయంతో ఈ అపాయాన్ని తప్పించుకోవాలి' అని అనుకున్నాయి.
     ప్రాణాలతో ఎలా బయటపడాలి? అనుకుంటున్న పాము, ముంగీసకు బోనులో కొన్ని చీమలు కనిపించాయి. వెంటనే అవి రెండూ చీమల నాయకుడి దగ్గరకు వెళ్లాయి. 'ప్రస్తుతం మమ్మల్ని రక్షించగలిగింది మీరొక్కరే. మీరు సహాయం చేస్తే మేము ప్రాణాలతో బయటపడతాం. వేటగాడి నుంచి మాకు ప్రమాదం పొంచి ఉంది. మేము చనిపోయినట్లు నటిస్తాం. మీరు మా శరీరాన్ని చుట్టుముట్టండి. కానీ మమ్మల్ని కుట్టొద్దు' అని బతిమిలాడాయి.
     తోటి మూగజీవుల ఆపదను గమనించిన చీమలన్నీ సమాలోచన చేసుకొన్నాయి. తెల్లవారక ముందే పాము, ముంగీస చచ్చిపడినట్లు ఉన్నాయి. చీమలు వాటిని చుట్టిముట్టినట్లు నటించడం మొదలెట్టాయి.
     వేటగాడు ఉదయాన్నే బోను తెరిచి చూశాడు. పాము, ముంగీసను చీమలు చుట్టి ఉండటం చూసి చనిపోయాయని భావించాడు. వాటి రెండింటినీ దూరంగా తీసుకెళ్లి పడేశాడు. అంతే పాము, ముంగీస తేరుకొని మెరుపు వేగంతో దగ్గర్లో వున్న తుప్పల్లోకి పారిపోయాయి.
     సహజ శత్రుత్వంతో చావకుండా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నందుకు పాము, ముంగీస సంతోషించాయి. వాటికి ఎంతగానో సహకరించిన చీమలకు ధన్యవాదాలు తెల్పుకున్నాయి.

- మీగడ వీరభద్రస్వామి
7893434721